అత్యంత వేగంగా పరుగులు పెడుతూ శక్తిమంతమైన ఆర్థికవ్యవస్థల సరసన స్థానాన్ని సంపాదించుకుంటోంది భారత్. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమైతే తమకు లబ్ధి చేకూరుతుందని బ్రిటన్ భావిస్తోంది. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హయాంలో వాణిజ్య సహకార బలోపేతం దిశగా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు.. భారత్-బ్రిటన్ నిర్ణయించాయి. 2022 దీపావళి నాటికి ఒప్పందం పూర్తి చేసుకోవాలని బోరిస్ గడువును నిర్దేశించుకున్నారు. ఈలోగా యూకేలో రాజకీయ అనిశ్చితులతో ఒప్పంద ప్రక్రియ నత్తనడక సాగుతోంది.
ప్రధాని పీఠమెక్కిన రిషి సునాక్.. ఎఫ్‌టీఏ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు. బ్రిటన్ ఎగువసభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఎఫ్‌టీఏపై చర్చలు మెరుగ్గా ముందుకెళ్తున్నాయని దక్షిణాసియా వ్యవహారాల మంత్రి తారిక్ అహ్మద్ ప్రకటించారు. అతి త్వరలో మరో దఫా చర్చలు జరగనున్నాయనీ.. భారత్‌తో భాగస్వామ్యం బ్రిటన్‌కు కీలకమని ఆయన తెలిపారు. బ్రిటిష్ ఎగుమతిదారుల ప్రయోజనాల కోసం సుంకాలను తగ్గించుకునేందుకు ఒప్పందం దోహదపడుతుందనీ.. దీర్ఘకాలంలో యూకే ఆర్థిక వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుందని తారిక్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఎగువ సభలో మరో సభ్యుడు కరన్ బిలిమోరియా ఈ అంశంపై మాట్లాడారు. భారత్ జీ20 కూటమికి అధ్యక్షత వహించనుందనీ.. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచ రెండో ఆర్థిక శక్తిగా ఎదిగే లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే వేగవంతమైన రైలు ఏంటంటే.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థేనన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే స్టేషన్ దాటేసిందనీ.. ఆ దేశానికి యూకే మరింత దగ్గరవ్వాలని సునాక్‌కు సూచించారు. రాబోయే దశాబ్దాలకు అత్యంత విశ్వసనీయ స్నేహితుడు, భాగస్వామిగా బ్రిటన్ మారాలనీ.. త్వరగా భారత పర్యటనకు వెళ్లాలని అని రిషి సునాక్ సర్కారుకు కరన్ సూచించారు.