Srilanka president: ప్రజాతీర్పు ద్వారా కాకుండా పార్లమెంటు సభ్యులు శ్రీలంక దేశాధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి రావడం 1978 తర్వాత ఇదే ప్రథమం. ఈ నెల 20న రహస్య ఓటింగ్ విధానంలో ఎంపీలు తమ దేశాధినేత ఎవరో నిర్ణయిస్తారు. 2024 నవంబరు వరకు కొత్త అధ్యక్షుడు అధికారంలో ఉంటారు. శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులున్నారు. 1982, 1988, 1994, 1999, 2005, 2010, 2015, 2019లలో ప్రజలు అధ్యక్ష ఎన్నికల్లో ఓటేశారు. 1993లో మాత్రమే మధ్యంతర ఎన్నిక అవసరమైంది. అప్పటి అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస హత్యకు గురికావడంతో.. మిగిలిన ఏడాది పదవీ కాలానికి డి.బి.విజయతుంగను పార్లమెంటు ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గొటబాయ రాజపక్స రాజీనామాతో ప్రస్తుత మధ్యంతర అధక్ష్య ఎన్నిక అనివార్యమైంది. ఈ రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
విక్రమసింఘె.. సొంత బలగం లేకున్నా బలవంతుడే: ప్రస్తుత ప్రధాని, తాత్కాలిక అధ్యక్షుడైన రణిల్ విక్రమసింఘే దేశాధినేత పోటీదారుల్లో అగ్రభాగాన ఉన్నారు. గత మే నెలలో అనూహ్యంగా ఆయన ప్రధాన మంత్రి పదవిని చేపట్టాల్సి వచ్చింది. విక్రమసింఘె సొంత పార్టీ.. యూఎన్‌పీ 2020 పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. ఓట్ల శాతం ఆధారంగా నైష్పత్తిక ప్రాతినిధ్యం విధానంలో యూఎన్‌పీ తరఫున విక్రమసింఘె ఒక్కరే పార్లమెంటులో అడుగుపెట్టగలిగారు. ప్రజాదరణ లేనప్పటికీ ఆలోచనాపరుడిగా, వ్యూహకర్తగా, దార్శనికుడిగా వివిధ రాజకీయపక్షాలకు ఆయన ఆమోదనీయుడే. ఈ సానుకూలాంశమే గత మేలో మహింద రాజపక్స స్థానంలో ప్రధాని అయ్యే అవకాశం కల్పించింది. దేశాధ్యక్షపదవిని చేపట్టాలని ఆకాంక్షించిన విక్రమ సింఘే 1999, 2005 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ప్రస్తుతం సొంత ఎంపీల బలం లేకున్నప్పటికీ అధ్యక్ష పదవి పోటీలో అధికార శ్రీలంక పొదుజన పెరమున(ఎస్‌ఎల్‌పీపీ) ఆయనకు మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సాగర కరియవసం శుక్రవారం వెల్లడించారు. ఎస్‌ఎల్‌పీపీకి పార్లమెంటులో 100 మంది సభ్యులున్నారు.
వామపక్ష అనుకూల నేత దుల్లాస్ అలహప్పేరుమ: అధికార ఎస్‌ఎల్‌పీపీ చీలిక వర్గ నేత అయిన దుల్లాస్ అలహప్పేరుమ పేరు కూడా అధ్యక్ష పదవి రేసులో వినిపిస్తోంది. 2005లో సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. వామపక్ష భావజాల సమర్థకుడు. నిజాయితీపరుడనే పేరుంది. విపక్ష సభ్యులతో పాటు అధికార ఎస్‌ఎల్‌పీపీ మద్దతును ఎంత వరకు పొందగలరనే దానిపై ఆయన విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
విపక్ష అభ్యర్థి సాజిత్ ప్రేమదాస: పార్లమెంటులో ప్రధాన విపక్షం.. సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) అధినేత సాజిత్ ప్రేమదాస పేరు అధ్యక్ష పదవికి బాగా వినిపిస్తోంది. సాజిత్ నేతృత్వంలోని ఎస్‌జేబీ 2020 పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. విక్రమసింఘెకు చెందిన యూఎన్‌పీని చావుదెబ్బతీసింది. 54 మంది ఎంపీలున్నా మే నెలలో ప్రధాన మంత్రి పదవికి ఏర్పడిన రాజకీయ శూన్యతను తనకు అనుకూలంగా మలచుకోవడంలో సాజిత్ విఫలయ్యారు. అధికార ఎస్‌ఎల్‌పీపీ ఎంపీల మద్దతు సాజిత్‌కు లభించడం కష్టమే. అయితే, ప్రతిపక్షంలో ఉన్న 14 పార్టీలకు(ఎస్‌జేబీకి చెందిన 54 మందితో కలిపి) 122 మంది ఎంపీలున్నారు. వీరిలో స్వతంత్రులు 44 మంది. వీరందరినీ కూడగట్టడంపైనే సాజిత్ విజయం ఆధారపడి ఉంటుంది.
స్వయంప్రకటిత అభ్యర్థి శరత్ ఫొన్సెకా: మాజీ సైన్యాధిపతి ఫీల్డ్‌మార్షల్ శరత్ ఫొన్సెకా దేశాధ్యక్షపదవికి పోటీ చేస్తానని గురువారం స్వయంగా ప్రకటించారు. ఎల్‌టీటీఈని తుదముట్టించడంలో కీలకపాత్ర వహించిన ఫొన్సెకాకు సింహళ బౌద్ధుల మద్దతు దండిగా ఉంది. రాజపక్స కుటుంబానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిలో అనేకులు ఫొన్సెకా అనుయాయులు. అయితే ఎస్‌జేబీకి చెందిన ఈ ఎంపీకి సొంత పార్టీ సభ్యుల మద్దతు లభించడం కష్టమే. ఎందుకంటే ఆ పార్టీ అధినేత సాజిత్ ప్రేమదాసను రంగంలోకి దించాలని పార్లమెంటరీ పార్టీ నిర్ణయించడమే. ఒకవేళ ప్రేమదాస తప్పుకుంటే ఫొన్సెకాకు మార్గం సుగమం కావచ్చు.
రాజపక్స సోదరులకు కోర్టులో ఎదురుదెబ్బ: శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స ఈ నెల 28 వరకు దేశాన్ని వీడి వెళ్లరాదని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. నిరసనకారులపై దాడులు, దేశ ఆర్థిక సంక్షోభానికి సంబంధించి వీరిపై జూన్ 17న న్యాయస్థానంలో కేసు దాఖలైంది. దీనిపై శుక్రవారం విచారణ సందర్భంగా రాజపక్స సోదరులు విదేశాలకు వెళ్లరాదని కోర్టు స్పష్టం చేసింది. బసిల్ రాజపక్స గత సోమవారం రాత్రి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నించారు. వీరి సోదరుడు, శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ తొలుత మాల్దీవులకు, ఆ తర్వాత సింగపూర్‌కు పరారైన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: ఇజ్రాయెల్ నుంచి నేరుగా సౌదీ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
'మనం భూమ్మీద ఉన్నదే పిల్లల్ని కనడానికి'.. ఎలాన్ మస్క్ తండ్రి కామెంట్స్!