Parosmia after covid: 'కాఫీ వాసన మురికి కంపును తలపిస్తోంది.. చేపలు తిన్నా అదే రోత వాసన.. భరించలేకపోతున్నాం..' అని కొవిడ్-19 సోకిన వారిలో చాలా మంది ఫిర్యాదు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఈ కొవిడ్ అనంతర లక్షణానికి గురయ్యారు. ఇలా వాసన తెలియకపోవడాన్ని వైద్య పరిభాషలో 'పరోస్మియా' అంటారు. ఇది సోకిన వారికి సుపరిచిత వాసనలు కూడా వికారంగా అనిపిస్తాయి. దీంతో బాధితుల ఆహారపు అలవాట్లు ప్రభావానికి లోనవుతాయి. వారి మానసిక ఆరోగ్యమూ దెబ్బతింటుంది. దీనిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. మంచి వాసనలు సైతం దరిద్రమైన కంపు కొట్టడం వెనుక 15 విభిన్నమైన పదార్థాల ప్రమేయం ఉన్నట్లు తేల్చారు.
ఇందులో అత్యంత శక్తిమంతమైంది కాఫీలో ఉంటే 2-ఫ్యూరాన్ మిథనేథియాల్. సాధారణ వ్యక్తులు దీని వాసన చూసినపుడు కాఫీ లేదా పాప్‌కార్న్‌గా గుర్తించారు. పరోస్మియాతో బాధపడేవారు మాత్రం చెత్తకుండీ వాసనను తలపించిందని పేర్కొన్నారు. "కాఫీ వాసన కలిగించే రసాయనాలను మేం వేరు చేశాం. పరోస్మియాకు గురైన వారిని వాటి వాసన చూడమన్నాం. వారు ఇవి తమకు అసహ్యకరమైన, వికారమైన, రోత పుట్టించే వాసనలు కల్పిస్తున్నాయని చెప్పారు" అని పరిశోధకులు తెలిపారు. స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, ఫుడ్ అండ్ ఫార్మసీ, యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధన పత్రాన్ని జర్నల్ కమ్యూనికేషన్ మెడిసన్ ప్రచురించింది.
ఇదీ చూడండి : ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకు పోర్న్ ప్రదర్శన.. ఎందుకంటే?