Vivek Ramaswamy On Trump : అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. వివేక్ అవినీతిపరుడు, ఆర్థికనేరగాడని, తన మద్దతుదారులెవరూ ఆయనకు ఓటేయొద్దని కోరారు. మోసపూరిత ప్రచారాలతో తన అనుచరుల మద్దతు కూడగట్టేందుకు ప్రయతిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.
ట్రంప్ విమర్శలపై స్పందించిన వివేక్, ప్రచార సలహాదారుల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమన్నారు. స్నేహపూర్వక ఆరోపణలు ఇకపై పనిచేయవనీ, అంతేకాకుండా ట్రంప్‌పై ప్రతివిమర్శలు చేయాలని కోరుకోవటం లేదన్నారు. ట్రంప్ 21వ శతాబ్దపు గొప్ప అధ్యక్షుడని వివేక్ రామస్వామి మరోసారి ప్రశంసించారు. అయితే, న్యాయపరమైన చిక్కులు, రాజకీయ వ్యతిరేకత కారణంగా వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలవకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"నన్ను విమర్శిస్తూ డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్టు చూశాను. ఆయన ప్రచార సలహాదారుల సూచనతో ఇలాంటి దురదృష్టకర పరిస్థితి తలెత్తింది. ఇకపై స్నేహపూర్వకమైన ఆరోపణలు ఏ మాత్రం పనిచేయవని భావిస్తున్నా. ట్రంప్‌పై ప్రతివిమర్శలు చేయాలనుకోవడంలేదు. ఆయన 21వ శతాబ్దపు గొప్ప అధ్యక్షుడు. అయోవా ప్రచారంలో ట్రంప్ మద్దతుదారులను కలిశాను. వారంతా ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళనగా ఉన్నారు."
-- వివేక్ రామస్వామి, అధ్యక్ష ఎన్నికల పోటీదారుడు
అంతకుముందు "మీరు అయోవాలో రిపబ్లికన్ పార్టీ అనుచరులైతే డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు తెలపండి. వివేక్‌కు దూరంగా ఉండండి. ఆయనో మోసగాడు" అని ట్రంప్ ప్రచార సలహాదారుడు క్రిస్ లాసివిటా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉన్న వివేక్, మొదటి నుంచి ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నారు. కొలరాడో కోర్టు తీర్పు తర్వాత ట్రంప్ పోటీచేయకుంటే తాను ఎన్నికల బరి నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. మిగిలిన రిపబ్లికన్ అభ్యర్థులు సైతం పోటీకి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఆ సమయంలో వివేక్ నిర్ణయాన్ని ట్రంప్ సైతం మెచ్చుకున్నారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రచారంలో అయోవాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఆయనకు 53.6 శాతం మంది అనుకూలంగా ఉండగా, వివేక్‌కు 7.6 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. సోమవారం పలు మీడియా సంస్థలు అయోవా పోల్ సర్వేలను వెల్లడించనున్న నేపథ్యంలో ట్రంప్ విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.
'నన్ను గెలవనీయకుండా కుట్రలు'- న్యాయమూర్తిపైనే విరుచుకుపడ్డ ట్రంప్!