జర్మనీలో జరుగుతున్న మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీతో సమావేశమయ్యారు. అమెరికాపై చైనా నిఘా బెలూన్ వ్యవహారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగిన వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు గంటపాటు వీరి భేటీ జరిగింది.
ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యాకు చైనా ఆయుధాలు సరఫరా చేయవచ్చనే వార్తల నేపథ్యంలో డ్రాగన్‌ను అమెరికా గట్టిగా హెచ్చరించింది. రష్యాకు సహకారం, ఆంక్షల ఎగవేతలో తోడ్పాటు అందించినట్లయితే ఎదురయ్యే చిక్కులు, పరిణామాల గురించి వాంగ్ యీని బ్లింకన్ హెచ్చరించారు. రష్యాకు సహకరిస్తే చైనాపై ఆంక్షలు విధిస్తామని ఆంటోనీ బ్లింకెన్ తేల్చిచెప్పారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన నిఘా బెలూన్ వ్యవహారం ఈ భేటిలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇటువంటి బాధ్యతారాహిత్య చర్యలను పునరావృతం చేయొద్దని చైనాకు అమెరికా హెచ్చరించింది. తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే చర్యలను సహించబోమని అగ్రరాజ్యం స్పష్టం చేసింది.
మరోవైపు.. బెలూన్ వ్యవహారంలో అమెరికా స్పందించిన తీరుతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని చైనా పేర్కొంది. స్థానిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అమెరికా ఇటువంటి పనులు చేయొద్దని పేర్కొంది. చైనా బెలూన్ కూల్చివేత ఘటన విషయంలో చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ బెలూన్ ఘటనే బ్లింకెన్ చైనా పర్యటన రద్దుకూ కారణమైంది.