అమెరికా వెళ్లాలనుకునే వృత్తి నిపుణులకు శుభవార్త! హెచ్1బీ వీసాల కోసం మార్చి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అమెరికా తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 2023-24 సీజన్‌కు ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. మార్చి 1 నుంచి 17 మధ్య దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. వీసాలు జారీ అయిన విషయాన్ని మార్చి 31న వెల్లడించనుంది. సంబంధిత వ్యక్తులకు వ్యక్తిగత నోటిఫికేషన్ ద్వారా ఈ విషయం తెలియజేస్తామని వెల్లడించింది.
నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అనుమతిస్తూ జారీ చేసే వీసానే హెచ్1బీ వీసా అంటారు. భారత్, చైనా వంటి దేశాల నుంచి నిపుణులను నియమించుకునేందుకు టెక్ కంపెనీలు ఈ వీసాలపై భారీగా ఆధారపడుతుంటాయి. హెచ్1బీ వీసా వల్ల.. టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లోని ఉద్యోగులు ఆరేళ్ల వరకు అమెరికాలో ఉండి, పని చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత గ్రీన్‌కార్డు అప్లై చేసుకోవడం ద్వారా శాశ్వతంగా అమెరికాలో ఉండేందుకు అవకాశం లభిస్తుంది.
ఏటా 85 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తారు. అందులో 20వేల వీసాలు అమెరికాలోని విద్యా సంస్థల్లో డిగ్రీలు చేసినవారికి, మిగిలిన 65 వేల వీసాలను లాటరీ పద్ధతిలో ఇతరులకు కేటాయిస్తారు. తక్కువ సంఖ్యలో వీసాలు ఉన్నందున వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ నిబంధనలను సరళించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి.