అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సోమవారం ఓ సాయుధ మహిళ ఓ ప్రైవేటు పాఠశాలలో చొరబడి విద్యార్థులపైకి విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తొమ్మిదేళ్ల వయసున్న ముగ్గురు విద్యార్థులతో సహా మరో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సాయుధురాలిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితురాలు అక్కడే చనిపోయింది. మృతులను ఎల్విన్ డిక్ఖాస్(9), హాలీ స్క్రగ్స్(9), విలియం కిన్నీ(9), కేథరిన్ కూన్స్(60), సింథియా పీక్(61), మైక్ హిల్(61)గా గుర్తించారు.
ఇలా జరిగింది..
ఈ మారణహోమం మొత్తం 14 నిమిషాల పాటు సాగింది. పాఠశాల పక్కన ఉన్న మార్గం నుంచి లోపలికి ప్రవేశించిన సాయుధురాలు.. మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు చేరుకొని కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. సమాచారం అందగానే వెంటనే రంగంలో దిగిన ఐదుగురు సభ్యుల పోలీసు బృందానికి.. రెండో అంతస్తు నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో మొదటి అంతస్తులో ఉన్న వారందరినీ ఖాళీ చేయించారు పోలీసులు. అనంతరం రెండో ఫ్లోర్‌కు వెళ్లారు. పోలీసులను చూసిన సాయుధ మహిళ.. వారిపైకి కూడా కాల్పులకు తెగబడింది. దీంతో పోలీసు బృందం జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితురాలు మృతి చెందింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10.13గంటలకు కాల్పుల ఘటన మొదలుకాగా.. 10.27గంటలకల్లా కాల్పులకు తెగబడిన సాయుధురాలిని పోలీసు బృందం కాల్చిచంపింది. నిందితురాలి వద్ద నుంచి రెండు రైఫిల్స్, ఓ హ్యాండ్‌గన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, ఆ మహిళను అదే పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు.
ఘటన జరిగిన సమయంలో పాఠశాలలో 200 మంది విద్యార్థులు, 50 మంది స్టాఫ్ ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నాష్విల్ పోలీసు అధికారి భావోద్వేగానికి గురయ్యారు. చనిపోయిన పిల్లలను స్కూల్ బయటకు తీసుకువస్తున్నప్పుడు కన్నీళ్లు వచ్చాయని తెలిపారు. కాగా, నిందితురాలిని స్థానికంగా ఉండే ఆడ్రీ హేల్(28) గా గుర్తించారు. అయితే, నిందితురాలు ఇలా ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో అనే విషయం బయటకు రాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా నిందితురాలి తండ్రిని విచారిస్తున్నట్లు సమాచారం.
బైడెన్ భావోద్వేగం..
నాష్విల్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇది హృదయవిదారక ఘటన అని అన్నారు. అమెరికాలో తుపాకీ హింసను అరికట్టడానికి ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. తుపాకీ హింస దేశాన్ని చీల్చివేస్తోందన్నారు. దీన్ని నిర్మూలించడం కోసం అయుధాల నిషేధాన్ని చట్టాన్ని ఆమోదించాలని కాంగ్రెస్(పార్లమెంట్)ను కోరారు. ఈ ఘటనపై త్వరగా స్పందించిన పోలీసులను బైడెన్ అభినందించారు.