Ukraine Crisis: 'పుతిన్ అధికారంలో కొనసాగకూడదు' అంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పోలాండ్ రాజధాని వార్సోలో చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. రష్యా లో అధికార మార్పిడి జరగాలని అమెరికా కోరుకుంటోందన్న వాదనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వెంటనే శ్వేతసౌధం రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టింది. రష్యాలో అధికార మార్పిడి చేయాలని బైడెన్ పిలుపునివ్వలేదని వివరణ ఇచ్చింది. పొరుగువారిపై పుతిన్ పెత్తనం చేయడాన్ని అనుమతించకూడదని దాని అర్థమని పేర్కొంది.
తొలుత బైడెన్ చేసిన ప్రకటన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి పెంచి మరింత కఠిన నిర్ణయాలు తీసుకొనేలా చేస్తుందని శ్వేతసౌధం అంచనావేసింది. వెంటనే బైడెన్ ప్రకటనపై వివరణ ఇచ్చుకొంది. బైడెన్ కోసం శ్వేత సౌధం సిద్ధం చేసిన ప్రకటనలో ఈ అంశాలు లేవు. కానీ, బైడెన్ ఈ ప్రకటన చేయడంపై అధికారులు కూడా ఆశ్చర్యపోయినట్లు సీఎన్‌ఎన్ కథనం పేర్కొంది. మరోపక్క బైడెన్ ప్రకటనపై క్రెమ్లిన్ మండిపడింది. తమ దేశ అధ్యక్షుడుగా ఎవరు ఉండాలనేది బైడెన్ నిర్ణయించరని.. రష్యా ప్రజలు ఎన్నుకొంటారని పేర్కొంది.
పోలాండ్ సరిహద్దుల్లో రష్యా దాడి: బైడెన్ పోలాండ్‌లో పర్యటిస్తోన్న సమయంలోనే ఆ దేశ సరిహద్దుల్లో ఉన్న ఉక్రెయిన్ నగరం ల్వీవ్‌పై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇప్పటి వరకు ఇతర నగరాలతో పోలిస్తే ల్వీవ్‌పై తక్కువ దాడులు జరిగాయి. దీంతో శరణార్థులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తున్నారు. తాజా ఘటనలపై ల్వీవ్ మేయర్ ఆండ్రీ సాడ్వే స్పందించారు. అమెరికా అధ్యక్ష పర్యటనను దృష్టిలో పెట్టుకొనే ఈదాడులు జరిగాయన్నారు. "నేటి దాడులతో దురాక్రమణదారులు పోలాండ్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు 'హలో' చెబుతున్నారు. పోలిష్ సరిహద్దులకు ఈ నగరం కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ముప్పు ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచం అర్థం చేసుకోవాలి" అని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: రాకెట్ దాడులతో దద్దరిల్లిన లవీవ్.. ఇంధన, ఆహార నిల్వలు ధ్వంసం