ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బ్రిటన్ పార్లమెంట్లో ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. రష్యా యుద్ధంలో ఓడిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ చెడుపై మంచే విజయం సాధిస్తుందని అన్నారు. 'ఈ యుద్ధంలో రష్యా ఓడిపోతుంది. ఈ విజయం ప్రపంచాన్ని మారుస్తుంది' అని యూకే చట్టసభలో ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన మొదటి రోజు నుంచి తమకు అండగా నిలిచిన బ్రిటిష్ ప్రజలకు ఆయన ధన్యావాదాలు తెలిపారు. యూకే పర్యటనలో భాగంగా జెలెన్‌స్కీ ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. రణరంగంలో రష్యాను దీటుగా ఎదుర్కొవడానికి ఆధునిక ఆయుధాల సరఫరాపై ఇరు దేశాల నాయకులు చర్చించారని అధికారులు వెల్లడించారు. నాటోకు చెందిన అధునాతన ఫైటర్ జెట్లను నడిపే విధంగా ఉక్రెయిన్ పైలెట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
జెలెన్‌స్కీ పర్యటన ఆ దేశ ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని, బ్రిటన్‌తో ఉన్న విడదీయరాని బంధాన్ని తెలియజేస్తోందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. 2014 నుంచి ఉక్రెయిన్ దళాలకు బ్రిటన్‌లో శిక్షణను ఇస్తున్నామని సునాక్ తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని సైనికుల స్థాయి నుంచి మెరైనర్లు, పైలట్ల స్థాయికి విస్తరిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నామని వెల్లడించారు. ఇది ఉక్రెయిన్‌పై తమ దేశ నిబద్ధతను తెలియజేస్తోందని బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ పేర్కొన్నారు. అయితే రష్యాతో యుద్ధం మెుదలైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు బ్రిటన్‌కు రావడం ఇదే తొలిసారి.