Ukraine news: ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టిన రష్యాకు ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో ఇప్పుడు తూర్పు ప్రాంతంపై దృష్టిసారించింది. డాన్‌బాస్ ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న మాస్కో సేనలు.. ఉక్రెయిన్ బలగాలకు అల్టిమేటం జారీ చేశాయి. ఉక్రెయిన్‌లోని కీలకమైన తీర ప్రాంతం నగరం మరియుపోల్‌లో ఉన్న ఉక్రెయిన్ సైనికులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని రష్యా అల్టిమేటం జారీ చేసింది. లొంగిపోయిన సైనికుల ప్రాణాలకు రష్యా హామీ ఇస్తుందని పేర్కొంది. వారందరినీ జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలుగా పరిగణించి సదుపాయాలు కల్పిస్తుందని వెల్లడించింది. ఈ విషయాన్ని రష్యా శనివారం రాత్రి నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఉక్రెయిన్ వర్గాలకు వెల్లడిస్తోంది. రష్యా కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు డెడ్‌లైన్ విధించింది. ప్రస్తుతం మరియుపోల్‌లో లక్షమంది ఉండగా.. చిన్నచిన్న ప్రాంతాలు మినహా.. అత్యధిక ప్రాంతం రష్యా అధీనంలోనే ఉంది. మరియుపోల్‌లో పరిస్థితి దారుణంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం వెల్లడించిన తర్వాత రష్యా అల్టిమేటం జారీ చేసింది. రష్యా ఇచ్చిన అల్టిమేటంను ఉక్రెయిన్ బేఖాతరు చేసింది. డెడ్‌లైన్ సమయాన్ని అసలు పట్టించుకోలేదు. ఏది ఏమైనా యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడుతామన్నట్లుగా ఉక్రెయిన్ ఉంది.
మరియుపోల్‌లో రష్యా పైచేయి సాధిస్తే దాదాపు రెండు నెలల యుద్ధంలో పుతిన్‌కు ఇదే అతిపెద్ద విజయంగా నిలవనుంది. ఉక్రెయిన్‌కు మరియుపోల్ వ్యూహాత్మకంగా కీలకమైన తీరప్రాంతం. దాదాపు రెండు నెలలుగా ఉక్రెయిన్‌పై సైనికచర్య చేపట్టిన రష్యా సైనికులను ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. వేలాదిమంది శవాలగుట్టలతో భీతావహంగా మారిన మరియుపోల్‌లోని నగరప్రాంతాలను తమ బలగాలు అధీనంలోకి తీసుకున్నాయని రష్యా రక్షణశాఖ పేర్కొంది. ఐరోపాలోనే అతిపెద్ద మెటలర్జికల్ ప్లాంట్‌లో ఉక్రెయిన్ బలగాలు ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాంట్‌లో ఎంతమంది సైన్యం ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. ఆ ప్రాంతం నుంచి మంటలు, పొగ వస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు బయటికి వచ్చాయి.
రష్యా విధించిన అల్టిమేటంపై ఉక్రెయిన్ వర్గాలు స్పందించలేదు. కానీ మరియుపోల్ నగరంలో రష్యా వైమానిక దాడులు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. రష్యా బలగాలు మరియుపోల్‌లో ఉద్దేశపూర్వకంగా అందర్నీ నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాపై విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్ సైనికులను హతమార్చడం ఇరుదేశాల మధ్య జరుగుతున్న శాంతిచర్చలకు విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించారు. తమ సైనికులను నిర్బంధించారని.. గాయపడిన వారిని కూడా అడ్డుకున్నారని.. మరియుపోల్‌లో మానవతా సంక్షోభం ఏర్పడిందని.. అయినా ఉక్రెయినియన్లు తమను రక్షించుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్క మరియుపోల్ నగరంలోనే శనివారం నాటికి 4వేలమందికిపైగా ఉక్రెయిన్ బలగాలు చనిపోయినట్లు రష్యా తెలిపింది. కానీ ఉక్రెయిన్ మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,500 నుంచి 3,000 మంది తమ సైన్యం యుద్ధంలో మరణించినట్లు వెల్లడించింది. మరియుపోల్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా సేనలను నిలువరించినట్లు ఉక్రెయిన్ తెలిపింది.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు.. రష్యా స్ట్రాంగ్ వార్నింగ్