Ukraine Attacks Russian Ship : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి భీకర రూపు దాల్చింది. ఉక్రెయిన్‌లోని మరింకా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా పేర్కొంది. దొనెత్క్స్‌కి 20 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉందని తెలిపింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఒక ప్రకటన విడుదల చేశారు. మాస్కో సేనలు మరింకా పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను రష్యాకు చెందిన ప్రభుత్వం ఛానెల్ ప్రసారం చేసింది. రష్యా దాడులు ధాటికి మరింకాలో ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. పట్టణమంతా శిథిలాల గుట్టగా మారింది. ఈ పట్టణం కోసం ఇది వరకే ఇరు దేశాలు భీకర దాడులు చేసుకోగా తాజాగా ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే ఉక్రెయిన్, మాస్కో ప్రకటనపై స్పందించలేదు.
'రష్యా యుద్ధనౌకపై క్షిపణి దాడి చేశాం'
మరోవైపు క్రిమియాలో రష్యాకు చెందిన యుద్ధ నౌకపై క్షిపణి దాడులు చేశామని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ దాడిలో నౌక భారీగానే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. క్షిపణులు నౌకపై విరుచుకుపడగానే పోర్టు ప్రాంతమంతా నారింజ రంగులోకి మారిపోయింది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు క్రిమియా గవర్నర్ తెలిపారు. ఆరు భవనాలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు. పోర్టులో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ దాడిని రష్యా కూడా ధ్రువీకరించింది. ఉక్రెయిన్‌కు చెందిన రెండు ఫైటర్ జెట్లను తమ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులు నేలకూల్చాయని తెలిపింది. అయితే రష్యా ప్రకటనను ఉక్రెయిన్ ఖండించింది. తమ ఫైటర్ జెట్లపై ఎలాంటి దాడి జరగలేదని ఉక్రెయిన్ వైమానిక అధికార ప్రతినిధి తెలిపారు.
కీలక ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు
భారత్, రష్యా సంయుక్తంగా నిర్మిస్తున్న కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ భవిష్యత్తు విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి సంబంధించి కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి. రష్యా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఆ దేశ ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్‌తో ఆర్థిక సహకారంపై సమావేశం నిర్వహించిన తర్వాత అణు విద్యుత్ ఒప్పందాలు జరిగాయి. వీటితో పాటు ఔషధాలు, వైద్య పరికరాల రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగినట్లు విదేశాంగశాఖ తెలిపింది.
రక్షణ, అణుశక్తి, అంతరిక్ష రంగాల్లో రష్యాను ప్రత్యేక, విశ్వసనీయ భాగస్వామిగా జైశంకర్ ఈ సందర్భంగా అభివర్ణించారు. ఇండియా, యురేషియన్ ఎకనామిక్ జోన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించడానికి జనవరి చివరి నాటికి ఇరు దేశాల బృందాలు సమావేశం అవ్వాలని రెండు దేశాలు నిర్ణయించినట్లు జైశంకర్ చెప్పారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత సమతుల్యంగా, స్థిరంగా ఉంచడంపై చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.
Russia Ukraine War : 500 రోజులు.. 9వేల మంది పౌరులు బలి.. మరో 63 లక్షల మంది..