Liz Truss becomes British Prime Minister : బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌పై ఆమె విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, ప్రధానిగా లిజ్ ట్రస్‌ను ఎన్నుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఆరు వారాలుగా హోరాహోరీ ప్రచారంతో పాటు అంతర్గతంగా పోలింగ్ జరగ్గా.. తాజాగా తుది ఫలితాలు వెల్లడయ్యాయి. పోలింగ్ సెప్టెంబర్ 2తో పూర్తయింది. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత విజేతను ప్రకటించారు. దీంతో బ్రిటన్ ప్రధాని ఎంపికలో ఉత్కంఠకు తెరపడింది.
భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్‌కు మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమెకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలన్నీ ఘంటా పథంగా చెబుతూ వచ్చాయి. సర్వేల అంచనాలను నిజం చేస్తూ మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ పగ్గాలు చేపట్టిన మూడో మహిళా ప్రధానిగా 47 ఏళ్ల లిజ్ రికార్డు సృష్టించారు.
ఈ ఎన్నికల్లో లిజ్ ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా.. రిషి సునాక్‌కు 60,339 ఓట్లు వచ్చాయి. దీంతో దాదాపు 21 వేల ఓట్ల తేడాతో సునాక్‌పై లిజ్ పైచేయి సాధించారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా లిజ్ ట్రస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల ప్రధానిగా ఉంటానని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో పన్నులు తగ్గించి ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు ధైర్యమైన ప్రణాళికలను అందిస్తానన్నారు. ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించనున్నట్టు తెలిపారు.
మోదీ ట్వీట్: బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికై ప్రధాని బాధ్యతలు చేపట్టనున్న లిజ్ ట్రస్‌కు శుభాకాంక్షలు చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆమె నాయకత్వంలో భారత్- బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
అవిశ్వాస పరీక్షలో నెగ్గినప్పటికీ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ను పదవీగండం వీడలేదు. వరుస వివాదాలు చుట్టుముట్టడంతోపాటు మంత్రులు, సొంతపార్టీ సభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలువురు కేబినెట్‌కు రాజీనామాలు చేసిన అనంతరం.. బోరిస్‌పై ఒత్తిడి పెరగడంతో చివరకు జులై 7న ప్రధానమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నిక మరోసారి అనివార్యమయ్యింది.
తొలుత ముందంజలో రిషి సునాక్.. ఆ తర్వాత..
కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత ప్రారంభ దశలో రిషి సునాక్ ముందంజలో దూసుకెళ్లారు. ఎంపీల్లో ఎక్కువ మద్దతు ఆయనకే లభించింది. విదేశాంగ మంత్రి ట్రస్‌కు టోరి ఎంపీల మద్దతు తక్కువనే చెప్పవచ్చు. వారి పోలింగ్‌లో ట్రస్ రెండో స్థానంలో నిలిచారు. అయితే, పార్టీ సభ్యులు వేసే ఆన్‌లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ మొదలైనప్పటి నుంచి ట్రస్‌కు ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. అధికారంలోకి వస్తే వెంటనే పన్నుల భారాన్ని తగ్గిస్తానని లిజ్ ట్రస్ పేర్కొనడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
అయితే, సునాక్ మాత్రం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంపై ప్రధానంగా దృష్టి పెడతాననే నినాదంతో ముందుకు వెళ్లారు. ఇలా ప్రచారం ముగింపు దశకు చేరుకున్న సమయంలో వచ్చిన సర్వేలు లిజ్ ట్రస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాయి. అయినప్పటికీ విశ్వాసం కోల్పోని సునాక్.. చివరి క్షణంలోనూ ప్రచారాన్ని దూకుడుగానే కొనసాగించారు. తాము ఎన్నికైనట్లయితే ఇంధన సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని ఇద్దరూ ఆదివారం వేర్వేరుగా ప్రకటించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో ఇద్దరు నేతలు మంచి స్ఫూర్తితో ప్రచారాన్ని నిర్వహించారని కన్జర్వేటరీ పార్టీ ఛైర్మన్ ఆండ్రూ స్టీఫెన్సన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్టీ సభ్యులు అడిగిన దాదాపు 600 ప్రశ్నలకు ఇరువురు నేతలు సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు.
ఇవీ చూడండి : 'భారత్ పెద్ద దేశం.. రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు'