Gold Found In Ship Colombia Coast: సముద్ర గర్భంలో భారీ మొత్తంలో బంగారాన్ని కొలంబియా అధికారులు తాజాగా గుర్తించారు. దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం మునిగిపోయిన రెండు నౌకల శిథిలాల కింద గుట్టల కొద్దీ బంగారు నాణేలు, ఇతర వస్తువులు ఉన్నట్లు తెలిసింది. వీటి విలువ 17 బిలియన్ డాలర్ల పైనే ఉంటుందని కొలంబియా అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.33లక్షల కోట్లకు పైమాటే..!
1708లో స్పెయిన్ యుద్ధం జరిగిన సమయంలో ఆ దేశానికి చెందిన శాన్ జోస్ అనే భారీ నౌక బ్రిటిష్ దాడుల్లో మునిగిపోయింది. ఆ సమయంలో నౌకలో 600 మంది ప్రయాణికులతో పాటు బంగారు ఆభరణాలు, రత్నాలు వంటివి కూడా ఉన్నాయి. ఈ నౌక శిథిలాలను 2015లో గుర్తించారు. అప్పటి నుంచి నౌక గురించి తెలుసుకునేందుకు కొలంబియా ప్రభుత్వం పరిశోధనలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే అత్యాధునిక సాంకేతిక సాయంతో సముద్ర గర్భంలోకి రిమోట్ కంట్రోల్ వాహనాన్ని పంపింది. ఈ క్రమంలోనే శాన్ జోస్ నౌక మునిగిన ప్రాంతానికి సమీపంలో మరో రెండు నౌకల శిథిలాలు తాజాగా బయటపడ్డాయి.
కొలంబియా తీరం నుంచి 3100 అడుగుల లోతులో ఈ నౌకలు ఉన్నట్లు ఆ వాహనం గుర్తించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కొలంబియా ప్రభుత్వం విడుదల చేసింది. నౌకల శిథిలాల్లో అనేక బంగారు నాణేలతో పాటు చెల్లాచెదురుగా పడి ఉన్న కుండలు.. చెక్కు చెదరని పింగాణీ కప్పులు కూడా కన్పించాయి. ఓ నౌకకు ఉన్న విల్లు ఇప్పటికీ ఏ మాత్రం చెడిపోలేదట. ఈ నౌకల్లో ఒకటి కలోనియల్ బోట్, మరొకటి షూనర్ అని అధికారులు ధ్రువీకరించారు. 1810లో స్పెయిన్ నుంచి కొలంబియాకు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఈ నౌకలు మునిగిపోయి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు రెండు శతాబ్దాల కిందటివి. ఈ నౌకలపై పరిశోధనలు చేపట్టనున్నట్లు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ తెలిపారు.
ఇవీ చదవండి: బోరుబావిలో 12ఏళ్ల బాలుడు.. 50 అడుగుల లోతులో మృత్యువుతో పోరాటం
Muslims Protest: దేశవ్యాప్తంగా ముస్లింల భారీ ప్రదర్శనలు.. పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు