తుర్కియే, సిరియాలో మరోసారి భూకంపం సంభవించింది. తుర్కియేలోని హతాయ్ ప్రావిన్సులో ఈ భూకంపం వల్ల ముగ్గురు మరణించగా.. 213 మంది గాయపడ్డారు. భూకంప కేంద్రం డెఫ్నె నగర సమీపంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తుర్కియే, సిరియాలో సోమవారం 6.4 తీవ్రతతో భూమి సంభవించినట్లు తుర్కియే మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు. అనేక భవనాలు కూలినట్లు వెల్లడించారు. రెస్క్యూ టీమ్లు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. భూకంప ప్రభావం జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాల్లోనూ స్వల్పంగా కనిపించింది.
భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన తుర్కియేకు అండగా ఉంటామని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. తుర్కియేకి అదనపు సాయాన్ని అందించేందకు సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు.
'నా ఆలోచనలు తుర్కియే, సిరియా భూకంప బాధితులతో కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి బృందాలు తుర్కియే, సిరియాలో పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. తుర్కియేకు అండగా ఉంటాం.'
--ఆంటోనియో గుటెరస్, ఐక్యరాజ్యసమితి చీఫ్
మరోవైపు.. వరుస భూకంపాలతో బాధపడుతున్న తుర్కియేకు పూర్తి సహకారం అందిస్తామని అమెరికా ప్రకటించింది. సోమవారం తుర్కియేలో సంభవించిన భూకంపం వల్ల ఆమెరికా ఆందోళన చెందుతోందని యూఎస్ జాతీయ సలహాదారు జేక్ సుల్లివన్ తెలిపారు.
కాగా, ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాలో భారీ భూకంపం సంభవించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 46,000 మంది మరణించారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరూ తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. భూకంపం వల్ల ఒక్క తుర్కియేలోనే 40 వేల మందికిపైగా మరణించారు. సిరియాలో దాదాపు 6,000 మంది దుర్మరణం పాలయ్యారు.
భూకంపం ధాటికి తుర్కియేలోనే 3,45,000 అపార్టుమెంట్లు కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు. వీటి సంఖ్య మరింత అవకాశం ఉన్నట్లు తెలిపారు. భూకంపం వల్ల.. సుమారు రూ.6.95లక్షల కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని తుర్కియేలోని వాణిజ్య సంఘాలు అంచనా వేశాయి. ఇది ఆయా దేశాల జీడీపీలో 10శాతం కంటే ఎక్కువని తెలిపాయి. భారీ భూకంపంతో బాధపడుతున్న తుర్కియే, సిరియాలకు భారత్ అండగా నిలిచింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలను తుర్కియే, సిరియాకు పంపింది.