ప్రకృతి విలయ తాండవానికి తుర్కియే, సిరియాల్లో మరణ మృదంగం మోగుతోంది. అంతకంతకూ పెరుగుతూవస్తున్న మృతుల సంఖ్య.. ప్రస్తుతం 30,000 దాటింది. భూకంప సహాయక చర్యల్లో అత్యంత కీలక సమయం ముగిసినా సరే.. ఇంకా అనేక మంది మృత్యువుతో పోరాడి విజయం సాధించి సజీవంగా బయటపడుతున్నారు. తాజాగా తుర్కియేలోని అంతక్యా నగరంలో ఓ చిన్నారి ఏకంగా 147 గంటలపాటు శిథిలాల కింద మృత్యువుతో పోరాడి గెలిచింది. పాక్షికంగా దెబ్బతిన్న భవనంలో నుంచి 'కుడి' అనే చిన్నారిని సహాయక బృందం సురక్షితంగా రక్షించింది. విపరీతమైన చలి, ఆహారంలేమి, పైన శిథిలాలు ఉన్నా ఆ చిన్నారి ధైర్యం కోల్పోకుండా ఉంది. నీరసంగా ఉండడం వల్ల కుడిని అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారు వారం రోజులపాటు జీవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నా.. రోజులు గడిచేకొద్ది తమ ఆశలు సన్నగిల్లుతున్నాయని కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్నారు. మరోవైపు కొద్దిమంది జీవించి ఉన్నా నీరసం కారణంగా.. అరవలేరని అలాంటి వారిని గుర్తించేందుకు థర్మల్ కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు రెస్య్కూ సిబ్బంది తెలిపింది.