Trump Indictment : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మియామిలోని ఫెడరల్ కోర్టుకు హాజరయ్యారు. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక పత్రాలను.. తన నివాసంలో దాచిపెట్టుకున్నారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. దీంతో అమెరికా చరిత్రలోనే నేరారోపణలు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరైన మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. విచారణ సందర్భంగా తనపై మోపిన అభియోగాలను ట్రంప్ తిరస్కరించారు. ఈ కేసులో ట్రంప్ అరెస్టుకు ఆదేశాలు వెలువడతాయనే ప్రచారం జరిగినా.. ఎలాంటి షరతులు లేకుండానే.. ఆయన కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. ట్రంప్ కోర్టు నుంచి బయటకు వచ్చిన తరువాత ఒక క్యూబన్ రెస్టారెంట్లో తన మద్దతుదారులతో కలిసి సరదాగా గడిపారు.
ట్రంప్ అధ్యక్ష ఎన్నికల తర్వాత రహస్య పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు అప్పగించకుండా.. తన వెంట తీసుకెళ్లారని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఎఫ్‌బీఐ ఫ్లోరిడాలోని ట్రంప్ మ్యాన్షన్‌లో సోదాలు చేపట్టింది. రహస్య పత్రాలను దాచిపెట్టినందుకు.. ట్రంప్‌పై మొత్తం 37 నేరారోపణలు నమోదయ్యాయి. అమెరికా చరిత్రలో అత్యంత విచారకరమైన రోజు ఇదేనని కోర్టుకు హాజరుకాక ముందు.. ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పేర్కొన్నారు. ట్రంప్ మద్దతుదారులు ఆందోళన చేపట్టే అవకాశం ఉండటం వల్ల కోర్టు పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నో కెమెరాస్
ట్రంప్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో న్యాయస్థానంలో జర్నలిస్టులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడానికి వీలులేదని కోర్టు ఆదేశించింది. దీనిపై పాత్రికేయులతో పాటు, మీడియా సంస్థలు కూడా తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
ట్రంప్ దాచిన రహస్య పత్రాల్లో అమెరికా అణుకార్యక్రమ ప్రణాళికలు, అమెరికా సహా దాని మిత్రదేశాలకు పొంచి ఉన్న సైనిక ముప్పు, వాటిని ఎదుర్కొనే ప్రణాళికలు లాంటి కీలక పత్రాలు ఉన్నాయని అమెరికా ఫెడరల్ కోర్టులో కేసులు నమోదయ్యాయి. అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థకు ఓ దేశం మద్దతిస్తున్నట్లు ఉన్న ఆధారాలను సైతం ట్రంప్ తీసుకెళ్లిన రహస్య పత్రాల్లో ఉన్నట్లు అభియోగం ఉంది. దీనితోపాటు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, సహా ఇతర నిఘా సంస్థల నుంచి అందిన అనేక పత్రాలు అందులో ఉన్నట్లు సమాచారం. వాటిని ట్రంప్ తన ఎస్టేట్‌లోని బాల్రూమ్, బాత్రూమ్, ఓ కార్యాలయం, బెడ్రూంల్లో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇరాన్ దాడికి సంబంధించిన అత్యంత రహస్యమైన ప్రణాళికలను 2021 జూన్‌లో.. న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్లో జరిగిన ప్రైవేట్ పార్టీకి హాజరైన అతిథులతో పంచుకున్నారని మరో అభియోగం. 2021 సెప్టెంబర్‌లో అమెరికా మిలిటరీకి చెందిన ఓ మ్యాప్‌ను.. ట్రంప్ తన పొలిటికల్ యాక్షన్ కమిటీలోని ఒక అనధికార వ్యక్తితో పంచుకున్నట్లు నేరాభియోగం ఉంది. అయితే వీటిని ట్రంప్ ఖండిస్తూ వస్తున్నారు.
ఇవీ చదవండి :