Sri Lanka Crisis News: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం సైతం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఎల్పీపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం, అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నాయి. శ్రీలంకలోని ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ మంగళవారం పార్లమెంటరీ స్పీకర్‌కు అవిశ్వాస తీర్మానాలను అందజేసింది. స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిసి తీర్మానాలను అందజేసినట్లు ఎస్‌జేబీ నేతలు వెల్లడించారు.
ఆర్టికల్ 42 ప్రకారం అధ్యక్షుడి మీద, ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు ప్రతిపక్ష నాయకులు తెలిపారు. తీర్మానంపై వీలైనంత త్వరగా చర్చ జరిగేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ సైతం అవిశ్వాసానికి మద్దతిచ్చినట్లు వెల్లడించారు. కొత్త రాజ్యాంగం రూపొందించాలన్న ప్రతిపాదనపై దృష్టి సారించేందుకు కేబినెట్ ఉపసంఘాన్ని నియమిస్తూ అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రకటించినప్పటికీ విపక్ష పార్టీలు అవిశ్వాసం వైపే మెగ్గుచూపాయి.
ఇదీ చదవండి: Vladimir Putin: రష్యా అధ్యక్షుడిగా తప్పుకోనున్న పుతిన్?