Sri lanka Crisis: శ్రీలంకలో ఇటీవల చోటుచేసుకున్న ఆందోళనల్లో అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ప్రాణాలు కోల్పోయారు. తొలుత ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించినప్పటికీ అది హత్యేనని శ్రీలంక పోలీసులు తేల్చారు. ఇద్దరు ఆందోళనకారులపై తుపాకీతో కాల్పులు జరిపిన అనంతరం ఎంపీ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుకున్నప్పటికీ.. ఆందోళనకారుల చేతుల్లోనే హత్యకు గురైనట్లు నిర్ధారించామన్నారు.
'సోమవారం జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన ఎంపీ వాస్తవంగా హత్యకు గురయ్యారు. తనను తాను కాల్చుకోలేదు. ఆందోళనకారుల చేతిలో చనిపోయారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయనను పట్టుకొని తీవ్రంగా కొట్టారు. దాంతో ఎంపీ ప్రాణాలు కోల్పోయారు' అని పోలీస్ అధికార ప్రతినిధి నిహాల్ థాల్‌దువా పేర్కొన్నారు. ఎంపీతో సహా తొమ్మిదిమంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఘర్షణలపై దర్యాప్తు జరపాలని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికే ఆదేశాలు జారీచేశారన్నారు.
ఇదిలా ఉంటే, ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో మునిగిపోయిన శ్రీలంకలో గత వారం రోజులుగా నిరసన జ్వాలలు భగ్గుమంటున్నాయి. ప్రధానమంత్రి మహీంద రాజపక్స మద్దతుదారులు, నిరసనకారులకు మధ్య సోమవారం నాడు జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో నిట్టంబువ పట్టణంలో అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు అమరకీర్తి అథూకోరలా (57) కారును ఆందోళనకారులు అడ్డుకోవడం వల్ల వారిపై ఆయన తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘనటలో ఇద్దరు ఆందోళనకారులు మృత్యువాతపడ్డారు. తిరగబడిన ఆందోళనకారులు ఎంపీని పట్టుకొని దాడి చేయడం వల్ల ఆయన కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా మృతి