Srilanka SJB Party Rejects Offer: శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సిందిగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స చేసిన ప్రతిపాదనను ప్రధాన ప్రతిపక్షం సమగి జన బలవేగే (ఎస్‌జేబీ) తిరస్కరించింది. తమ నేత సాజిత్ ప్రేమదాస పగ్గాలు స్వీకరించాల్సిందిగా అధ్యక్షుడు చేసిన అభ్యర్థనను తాము అంగీకరించడం లేదని ఆ పార్టీ ఆదివారం పేర్కొంది. అయితే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది. మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా శనివారం ప్రేమదాసను కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సిందిగా కోరారు.
అధ్యక్ష స్థానం నుంచి గొటబాయ రాజపక్స, ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స వైదొలిగితేనే తమ పార్టీ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తుందని ప్రేమదాస ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు ఈ రాజకీయ అనిశ్చితికి ముగింపు పలికేందుకు బార్ అసోషియేషన్ ఆఫ్ శ్రీలంక (బీఎఎస్‌ఎల్) ప్రతిపాదించిన 11 సూత్రాల ప్రణాళికను పరిశీలించాలని అధ్యక్షుడు గొటబాయ భావిస్తున్నారు. రాజ్యాంగ పరిధిలో ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు పరిశీలిస్తారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: చైనా విధేయుడికే హాంకాంగ్ పగ్గాలు.. కొత్త అధిపతిగా జాన్ లీ ఎన్నిక