Sri Lanka crisis: శ్రీలంక సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. నిత్యావసరాల ధరలు, పండ్లు, కూరగాయలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పార్లమెంట్ సమీపంలో భారీగా ఆందోళన చేపట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. "ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిత్యావసరాల ధరలు 100శాతానికి పైగా పెరిగాయి. గొటబాయ రాజపక్స అధికారం చేపట్టినప్పుడు కిలో బియ్యం 80 రూపాయలు. ప్రస్తుతం రూ.200 కంటే ఎక్కువ రేటు ఉంది. ప్రస్తుతం రోజుకు 13-14 గంటల కరెంటు కోతలు ఉన్నాయి. పరీక్షలు రాయడానికి కనీసం పేపరు కూడా లేదు. శ్రీలంకలోని ఆహార పదార్థాలను ప్రభుత్వం చైనాకు అమ్మేసింది. దేశంలో ప్రస్తుతం ఏమీ లేదని.. ఇతర దేశాల నుంచి అప్పుపై తెచ్చుకోవడమే" అని మహిళా నిరసనకారురాలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ఆర్థిక, రాజకీయ సంక్షోభాల మధ్య శ్రీలంకలో పండ్లు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 4 నెలల క్రితం యాపిల్ కిలో రూ. 500.. ఇప్పుడు కిలో రూ. 1000" అని హోటల్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు. 'ఈస్టర్ బాంబు దాడుల తర్వాత పర్యాటకంపై ప్రభావం పడింది. కొవిడ్‌తో పూర్తిగా దెబ్బతింది. పర్యాటకులు దేశంలోకి తిరిగి రావాలి. మాకు ఏ పార్టీలతోనూ, ఏ రాజకీయ నాయకులతో ఎటువంటి సమస్యలు లేవు.. పర్యాటకులు శ్రీలంకను సందర్శించాలి' శ్రీలంక చెఫ్స్ గిల్డ్ ఛైర్మన్ గెరార్డ్ మెండిస్ చెప్పారు. ఆహారం, ఇంధన కొరతతో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. కొవిడ్ మహమ్మారి విజృంభణతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనానికి దారితీసింది. విదేశీ మారకద్రవ్య కొరతను ఆ దేశం ఎదుర్కొంటోంది. విదేశీ మారకనిల్వలను లేకపోవడం వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది. ఇది దేశంలో విద్యుత్ కోతలకు దారితీసింది. నిత్యావసర వస్తువులను శ్రీలంక తన మిత్రదేశాల నుంచి సహాయం కోరాల్సి వస్తోంది.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం 26 మంది శ్రీలంక కేబినెట్ మంత్రులు రాజీనామాలు చేశారు. శ్రీలంకలో శనివారం సాయంత్రం 6 గంటలకు విధించిన 36 గంటల కర్ఫ్యూ సోమవారం ఉదయం 6 గంటలకు ఎత్తివేసింది. విద్యుత్ సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడటానికి భారతదేశం శ్రీలంకకు 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్‌ను పంపించింది. భారత్ గత 50 రోజులలో ద్వీప దేశానికి దాదాపు 200,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని సరఫరా చేసింది.
ఇదీ చదవండి: ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసంపై విచారణ మళ్లీ వాయిదా