స్పైడర్‌మ్యాన్, యాంట్‌మ్యాన్... మార్వెల్ సినిమాల్లో ఈ రెండూ పెద్ద సంచలనాలు. ఎన్నో ఏళ్లుగా స్పైడర్‌మ్యాన్ తన సాహసాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. యాంట్మ్యాన్కూ అభిమానులు ఎక్కువే. ఇలాంటి సినిమాలు కేవలం ఆహ్లాదాన్నే పంచుతాయనుకుంటే మీరు పొరబడ్డట్టే అంటున్నారు ఈ ఇజ్రాయెల్ సైకాలజిస్టులు.
ఇజ్రాయెల్‌కు చెందిన ప్రొఫెసర్లు డా. యాకొవ్ హోఫ్మన్, మెనచెమ్ బెన్ ఎజ్రా... మార్వెల్ సినిమాలకు వీరాభిమానులు. 2018లో విడుదలైన 'యాంట్‌మ్యాన్ అండ్ ద వాస్ప్' చిత్రాన్ని చూసిన ఎజ్రాకు వింత ఆలోచన వచ్చింది. ఇలాంటి సినిమాలు సాలెపురుగులు, చీమలంటే విపరీతమైన భయం ఉండే వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న ఆలోచనతో ఈ ఇద్దరు వెంటనే పరిశోధన మొదలు పెట్టారు. ఫోబియా ఉన్నవారిపై ఈ సినిమాలు సానుకూల ప్రభావం చూపిస్తాయని గుర్తించారు.
"యాంట్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ సినిమాల ప్రభావంపై పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాం. సాలెపురుగులు- స్పైడర్‌మ్యాన్... చీమలు- యాంట్మ్యాన్కు సినిమాకు సంబంధించి రెండు పరిస్థితులు ఎంచుకున్నాం. ఆ సినిమాలు చూడక ముందు, చూసిన తర్వాత పురుగులు, చీమలపై వారికున్న ఫోబియా గురించి ప్రశ్నించాం. వారిలోని ఫోబియా కొంతమేర తగ్గిందని గుర్తించాం. స్పైడర్‌మ్యాన్ సినిమా 7 సెకన్లు చూస్తే 20శాతం ఫోబియా తగ్గుతుంది. "
--డా. యాకొవ్ హోఫ్మన్, బార్- ఐలన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్
పరిశోధనలో భాగంగా 424 మందిని పరీక్షించినట్టు చెప్పారు హోఫ్మన్, ఎజ్రా. వీరి పరిశోధన ఇటీవలే 'ఫ్రాంటియర్స్ ఇన్ సైక్యాట్రీ' పత్రికలో ప్రచురితమైంది. అయితే ఇది కేవలం ప్రాథమిక నివేదికేనని... మరింత లోతైన పరిశోధన చేయాల్సి ఉందన్నారు ప్రొఫెసర్లు.
ఇదీ చూడండి: అంతరిక్ష వీధిలో వేసవి సెలవులు గడపొచ్చు!