Train accident in America: అమెరికాలోని మిస్సోరి ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లాస్ ఏంజిల్స్ నుంంచి చికాగో వెళుతున్న రైలు.. ఓ డంప్ ట్రక్కును ఢీ కొట్టింది. రైలు పట్టాలు తప్పి బోగీలన్నీ పక్కకు పడిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. 50కి పైగా మంది గాయాలపాలయ్యారు. రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు, ట్రక్కులోని వ్యక్తి మరణించాడని మిస్సోరి పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన వారి సంఖ్య స్పష్టంగా తెలియదని.. వారిని ఆస్పత్రికి తరలించామన్నారు.
ప్రమాద సమయంలో రైలులో 207 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. మెండన్ సమీపంలోని సరైన సిగ్నల్ లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు పట్టాలపై ఎందుకు నిలిపిఉంచారో అన్న విషయంపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమన్నారు అధికారులు. మంగళవారం ఎన్టీఎస్బీ పరిశోధకుల బృందం వచ్చి విచారణ చేపడుతారని తెలిపారు. తాను నిద్రలో ఉండగా.. రైలు ఒక్కసారిగా పక్కకు పడిపోయిందని.. లేచి చూసేసరికి కిటికి దగ్గర బురద, దుమ్ముతో నిండిపోయిందని ఓ ప్రయాణికురాలు తెలిపింది.
సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 20 అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు, ఆరు మెడికల్ హెలికాప్టర్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. రైలు పట్టాల సమీపంలో ఓ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రక్కును పట్టాలపై నిలిపి ఉంచారు. తాజాగా ఉత్తర కాలిఫోర్నియాలో ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
ఇదీ చదవండి: విషవాయువులు లీక్.. 13 మంది మృతి.. 251 మందికి అస్వస్థత