Nobel prize news: నోబెల్ శాంతి బహుమతి వేలంలో రికార్డు స్థాయి ధర దక్కించుకుంది. 103.5 మిలియన్ డాలర్ల గరిష్ఠ మొత్తానికి అమ్ముడైంది. ఉక్రెయిన్ శరణార్థి చిన్నారుల సహాయార్థం ఈ ప్రతిష్ఠాత్మక బహుమతిని అమెరికాకు చెందిన హెరిటేజ్ ఆక్షన్స్ వేలానికి ఉంచగా ఈ రికార్డు నమోదైంది. రష్యాకు చెందిన పాత్రికేయుడు దిమిత్రి మురతోవ్.. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. 2021 ఏడాదిగానూ ఆయన ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. రష్యన్ పత్రిక నొవయా గెజెటాకు ఎడిటర్ ఇన్ చీఫ్‌గా ఉన్నారు.
ఆ దేశ రాజకీయ, సామాజిక వ్యవహరాలపై విమర్శనాత్మక, పరిశోధనాత్మక కథనాలు వెలువరించే స్వతంత్ర వార్తా సంస్థ అది. తన స్వదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణకు చేస్తున్నందుకుగానూ మురతోవ్‌కు ఈ అవార్డు దక్కింది. 2014లో రష్యా.. క్రిమియాను ఆక్రమించడం, ప్రస్తుతం ఉక్రెయిన్‌పై జరుపుతోన్న దాడిని మురతోవ్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న దురాక్రమణ ఎంతోమంది చిన్నారులను శరణార్థులుగా మార్చివేసింది. వారి సహాయార్థం మురతోవ్ తన నోబెల్ బహుమతిని వేలానికి ఉంచారు.
ఈ వేలంలో నోబెల్ బహుమతి 103.5 మిలియన్ల డాలర్ల ధర పలికింది. అయితే దీనిని దక్కించుకుంది ఎవరో మాత్రం వేలం సంస్థ హెరిటేజ్ ఆక్షన్స్ వెల్లడించలేదు. 2014లో నోబెల్ పురస్కారానికి వేలంలో 4.76 మిలియన్ల డాలర్లు వచ్చాయి. ఇప్పటివరకు అదే అత్యధికం.
ఇవీ చదవండి: ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దు.. మళ్లీ ఎన్నికలు.. మూడేళ్లలో ఐదోసారి