రష్యాతో యుద్ధంలో తలపడుతున్న ఉక్రెయిన్‌కు.. అగ్రరాజ్యం అమెరికా 3.75 బిలియన్ డాలర్ల మిలిటరీ సహాయం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆరంభం అయినప్పటి నుంచి అమెరికా.. ఉక్రెయిన్‌కు మిలిటరీ, మానవతా సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు 24.9 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది.
తాజాగా ప్రకటించిన మిలిటరీ సాయంలో ఆయుధాలు
⦁ 50 బ్రాడ్లీ సాయుధ వాహనాలు
⦁ 500 టీఓడబ్ల్యూ యాంటీ ట్యాంక్ క్షిపణులు
⦁ 100 ఎమ్113 సాయుధ వాహనాలు
⦁ 55 ఎమ్ఆర్ఏపీ వాహనాలు, 138 హెచ్ఎమ్ఎమ్వీ వాహనాలు
⦁ 18 15మిమీ హావిట్జర్లు, 36 105మిమీ టోవ్డ్ హావిట్జర్లు
⦁ 18 మందుగుండు సామాగ్రి వాహనాలు
⦁ 1200 155మిమీ యాంటీ ఆర్మర్ మైన్ వ్యవస్థలు
⦁ 10 వేల మోర్టార్ రౌండ్లు
⦁ 4000 జూనీ ఎయిర్‌క్రాప్ట్ రాకెట్లు, 200 యాంటీ ఆర్మర్ రాకెట్లు
⦁ స్నైఫర్ రైఫిల్స్, మషీన్ గన్స్
⦁ హై మొబిలిటీ రాకెట్ వ్యవస్థలు
⦁ ఆర్ఐఎమ్ క్షిపణులు
⦁ మందుగుండు సామాగ్రి
వీటితో పాటు నైట్ విజన్ అద్దాలు, స్పేర్ పార్టులు తదితర పరికరాలు ఉన్నాయి.
'పుతిన్ ఊపిరి పీల్చుకో.. అతడి ఆలోచన అదే'
సంప్రదాయ క్రైస్తవులు పాటించే క్రిస్మస్ (ఈ నెల 6, 7 తేదీల్లో) నేపథ్యంలో ఉక్రెయిన్‌లో 36 గంటలపాటు కాల్పుల విరమణను పాటిస్తామంటూ ఏకపక్షంగా తాను చేసిన వాగ్దానాన్ని రష్యా ఉల్లంఘించింది. ఆ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే తూర్పు ఉక్రెయిన్ నగరం ఖేర్సన్‌పై క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో కొన్ని నివాస భవనాలు ధ్వంసమయ్యాయి.
బాధితులను కాపాడేందుకు సహాయబృందాలు రంగంలోకి దిగాయి. దీనిపై ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షులు జెలెన్ స్కీ, బైడెన్ స్పందించారు. యుద్ధానికి తాత్కాలిక విరామం ఇవ్వడం ద్వారా రెట్టించిన ఉత్సాహంతో పోరును కొనసాగించాలన్నది రష్యా పాచిక అని జెలెన్ స్కీ ఆరోపించారు. డాన్‌బాస్‌లో ముందుకుసాగుతున్న ఉక్రెయిన్ సైనికులను నిలువరించాలన్నది వారి ఆలోచన అని పేర్కొన్నారు. ఇక బైడెన్ స్పందిస్తూ.. ''పుతిన్ ఊపిరి పీల్చుకునేందుకే ఈ విరామం ప్రకటించారని నేను భావిస్తున్నాను'' అని అన్నారు.