Russia Ukraine War Update : రష్యా భూభాగంలో ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో సుమారు 14 మంది మృతిచెందగా, 108 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌కు సరిహద్దున 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్గొరోడ్‌లో ఈ దాడి జరిగినట్లు రష్యా ప్రకటించింది. ఈ దాడి ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పలు చిత్రాలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దాడి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలను రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ విడుదల చేసింది.
వీధుల్లో భవనాల శకలాలు, పొగ వ్యాపించి ఉన్నట్లు కనిపించాయి. ఇక మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండగా, గాయపడిన వారిలో 15 మంది చిన్నారులు ఉన్నట్లు రష్యా పేర్కొంది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అధికారులు సమాచారం అందించారు. బెల్గొరోడ్‌ను కీవ్ దళాలు తరుచూ లక్ష్యంగా చేసుకొని విచక్షణ రహితంగా షెల్లింగ్ చేస్తున్నట్లు రష్యా పేర్కొంది. సాధారణంగా ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు రాత్రి సమయంలో దాడులు చేస్తాయని, ఈసారి పగలే నగరం నడిబొడ్డున విరుచుకుపడ్డాయని గవర్నర్ తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా శుక్రవారం భారీ స్థాయిలో విరుచుకుపడింది. సుమారు 122 క్షిపణులు, 36 డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలపై రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో సుమారు 39 మంది మృతిచెందగా, 144 మంది గాయపడ్డారు. పలు పాఠశాలలు, మెటర్నిటీ ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్‌లతో సహా పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. భవన శిథిలాల కింద మరింతమంది చిక్కుకుపోయారు. గత 22 నెలలుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడి అని పలువురు పేర్కొన్నారు.
ఐరాస ఆందోళన!
మరోవైపు, గాజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న పాలస్తీనీయన్లు తినడానికి ఆహారం, ఉండడానికి వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఒక్క రఫా నగరానికే లక్ష మంది శరణార్థులు తరలి వెళ్లారని పేర్కొంది. అందులో కొంతమంది మాత్రమే గుడారాల్లో నివసిస్తున్నారని, మిగతా వారంతా పార్కులు, కార్లు ఇలా బహిరంగ ప్రదేశాల్లోనే తలదాచుకుంటున్నారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 165 మంది పాలస్తీనీయన్లు మృతి చెందారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది.
122 క్షిపణులు, 36 డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా- ఉక్రెయిన్‌తో యుద్ధంలో అతిపెద్ద దాడి ఇదే!
ఇజ్రాయెల్ మారణహోమం- ఒక్క రోజులో 187 మంది మృతి- 'ఇలా అయితే 'గాజా' కనుమరుగే'