Russia Ukraine War : ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేస్తోన్న రష్యాలో నిర్బంధ సైనిక సమీకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. కేవలం గతంలో సైనిక శిక్షణ తీసుకున్న వారినే కాకుండా వివిధ వర్గాల పౌరులను కూడా ఇందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రైతులను కూడా సైన్యంలో చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తాజాగా వెల్లడైంది. యుద్ధం కారణంగా పలు దేశాలు ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న వేళ.. తాజా నిర్ణయం దీనికి మరింత ఆజ్యం పోసే సూచనలు కనిపిస్తున్నాయి.
'వ్యవసాయ సంస్థలు, ప్రాంతీయ అధిపతులతోనూ సమావేశం అవ్వాలనుకుంటున్నాను. సైనిక సమీకరణలో భాగంగా వ్యవసాయ కూలీలను కూడా సిద్ధం చేస్తున్నాం. వారి కుటుంబాలు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నా' అని ఉన్నతాధికారులతో తాజాగా జరిగిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఈ ఏడాది 10కోట్ల టన్నుల గోధుమలతో సహా రికార్డు స్థాయిలో 15కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను పండించే దిశగా రష్యా పయనిస్తోందని వెల్లడించారు.
గోధుమల ఎగుమతుల్లో ప్రపంచంలో రష్యా అతిపెద్ద కేంద్రంగా ఉంది. సోయాబీన్, సన్‌ఫ్లవర్ పంటల్లోనూ రష్యాది కీలక పాత్ర. ముఖ్యంగా ఉక్రెయిన్ సరిహద్దు కుర్స్క్ ప్రాంతం ఈ ధాన్యాలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైన్యంలో పనిచేసేందుకు రైతులను కూడా సిద్ధం చేస్తామని పుతిన్ పేర్కొనడం పంట పనుల్లో బిజీగా ఉన్న రైతులకు ఆందోళన కలిగించేదిగా కనిపిస్తోంది. మరోవైపు నిర్బంధ సైనిక సమీకరణపై రష్యా పౌరుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పుతిన్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తోన్న పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అందులో కొంత మంది పురుషులకు సైన్యంలో చేరాలంటూ నోటీసులు ఇస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటివరకు లక్ష మందికిపైగా దేశం విడిచి వెళ్లిన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: గృహ నిర్బంధం వార్తలకు చెక్.. బహిరంగ కార్యక్రమంలో కనిపించిన జిన్పింగ్
'ఊరికే చెప్పడం లేదు.. అణుబాంబు వేసి తీరుతాం!'.. రష్యా హెచ్చరిక