Russia Missile Attack On Ukraine : ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణితో దాడి చేసింది రష్యా. ఈ దాడిలో 8మంది మరణించగా.. 56 మంది గాయపడ్డారు. ఉత్తర ఉక్రెయిన్‌లోని క్రామటోస్క్ మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు మిలిటరీ అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో క్షిపణి దాడి చేశారని వారు వివరించారు. దీనిపై సమాచారం అందుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
500 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం
US Aid To Ukraine : మరోవైపు ఉక్రెయిన్‌కు మరోసారి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. అదనపు భద్రతా సాయం కింద 500 మిలియన్ డాలర్లు ఇస్తున్నట్లు తెలిపింది. రష్యా చేస్తున్న దాడులకు కౌంటర్ చేసేందుకు వాయురక్షణ వ్యవస్థల బలం కోసం ఈ నిధులు ఉపయోగించనున్నట్లు చెప్పింది.
బెలారస్ చేరుకున్న ప్రిగోజిన్..
Wagner Group Chief Prigozhin : ప్రిగోజిన్ మంగళవారం ఉదయం బెలారస్ రాజధాని మిన్స్క్‌లో దిగారు. ఈ విషయాన్ని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ధ్రువీకరించారు. వారి సొంత ఖర్చులపై ప్రిగోజిన్, ఆయన అనుచరులు కొంతకాలం తమదేశంలో ఉండవచ్చని చెప్పారు.
'ఏడాదిలో రూ.8 వేల కోట్లు ఇచ్చాం'
రష్యాలో ఇటీవల తిరుగుబాటు చేసి వెనక్కి వెళ్లిన వాగ్నర్ గ్రూపునకు కేవలం ఏడాదిలోనే దాదాపు రూ.8వేల కోట్లకు పైగా చెల్లించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్‌పై చేస్తోన్న సైనిక చర్యలో పాల్గొన్న వాగ్నర్ గ్రూపు సైనికులకు జీతాలు, ఇతర రివార్డులో రూపంలో వీటిని అందించినట్లు ఆయన వెల్లడించారు. రక్షణశాఖ అధికారులతో మాస్కోలో నిర్వహించిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ వివరాలు వెల్లడించారు.
'మే 2022 నుంచి మే 2023 మధ్య కాలంలో వాగ్నర్ గ్రూపు బలగాలకు జీతాలు, ఇతర అలవెన్సుల రూపంలో 86.26 బిలియన్ రూబుల్స్‌ను రష్యా ప్రభుత్వం చెల్లించింది. సైనిక చర్యలో పాల్గొన్న వారికి అన్ని వనరులను ప్రభుత్వమే సమకూరుస్తోంది. వీటిని రక్షణశాఖ, ప్రభుత్వ బడ్జెట్ నుంచే అందిస్తున్నాం. మనమే ఆ గ్రూపునకు పూర్తిగా నిధులు సమకూర్చాం' అని రక్షణశాఖ అధికారులతో వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.
'రక్తపాతం జరగకుండా చూశారు'
మరోవైపు వాగ్నర్ గ్రూపు సాయుధ తిరుగుబాటుకు పాల్పడినప్పుడు యావద్దేశం ఐక్యతతో వ్యవహరించి రక్తపాతాన్ని నివారించిందని వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. తిరుగుబాటు ముగిశాక తొలిసారి సోమవారం రాత్రి టీవీ ఛానల్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. కిరాయి సైన్యం అధినేత ప్రిగోజిన్ పేరెత్తకుండా.. ఆ తిరుగుబాటుకు నేతృత్వం వహించిన వారిని విమర్శించారు. ఉక్రెయిన్ చేతిలో కీలుబొమ్మల్లా వారు వ్యవహరించారని తప్పుబట్టారు. రక్తపాతానికి దారితీయకుండా వాగ్నర్ పోరాటవీరులు కూడా సంయమనం పాటించారంటూ వారిని మాత్రం కొనియాడారు. తిరుగుబాటుకు రష్యా సైనికులు, ప్రజలు ఎలాంటి మద్దతు ఇవ్వలేదని పుతిన్ తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.