Rupert Murdoch Fox Corporation : మీడియా సామ్రాజ్యాన్ని ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు విస్తరించి.. మీడియా మొఘల్‌గా పేరుగాంచిన రూపర్ట్ మర్దోక్ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఏడు దశాబ్దాలపాటు మీడియా రంగంలో కొనసాగిన ఆయన.. ఫాక్స్ కార్పొరేషన్ అండ్ న్యూస్ కార్పొరేషన్ ఛైర్మన్ బాధ్యతలకు ముగింపు పలకనున్నట్లు ప్రకటించారు. ఆ బాధ్యతలను ఆయన కుమారుడు లాక్లాన్ మర్దోక్ చేపట్టనున్నారు.
"నా వృత్తి జీవితంలో నిత్యం వార్తలు, ఐడియాలతోనే గడిపాను. అది మారదు. మనకు నైపుణ్యం కలిగిన బృందాలు ఉన్నాయి" అని ఉద్యోగులకు పంపిన నోట్‌లో రూపర్ట్ మర్దోక్ పేర్కొన్నారు. ఇక 70 ఏళ్లపాటు చేసిన కృషికి ఫాక్స్ న్యూస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఆయా విభాగాలు, అన్ని భాగస్వామ్యపక్షాల తరఫున నాన్నకు అభినందనలు తెలియజేస్తున్నానని మర్దోక్ కుమారుడు లాక్లాన్ మర్దోక్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Rupert Murdoch Fox Ownership : సీఎన్‌ఎన్‌కు పోటీగా మర్దోక్.. 1996లో ప్రారంభించిన చిన్న స్టార్టప్.. అమెరికాలోనే నంబర్ 1 న్యూస్ ఛానల్‌గా అవతరించింది. ఫాక్స్ న్యూస్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది న్యూయార్క్ పోస్ట్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మీడియా సంస్థలను ఆయన స్థాపించారు. ప్రపంచ కుబేరుల్లో నిలిచిన మర్దోక్ సంపద 17 బిలియన్ డాలర్లు.
ఈ మీడియా మొఘల్‌కు ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు కాగా.. ఆరుగురు సంతానం. ఇటీవలే ఐదోపెళ్లికి ప్రయత్నించినప్పటికీ.. నిశ్చితార్థం తర్వాత అది రద్దయ్యింది. మర్దోక్- స్మిత్ జంటకు మార్చి 17న న్యూయార్క్‌లో నిశ్చితార్థం జరిగింది. వేసవిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి ప్రణాళికలన్నీ ఒక్కసారిగా ఆగిపోయినట్లు మర్దోక్ సన్నిహితులు వెల్లడించారు. 66 ఏళ్ల స్మిత్ అభిప్రాయాలతో ఆయనకు పొసగకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Rupert Murdoch Family : చివరిసారిగా 2016లో జెర్రీహాల్‌ను మర్దోక్ మనువాడారు. 2022లో ఈమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే స్మిత్ చేతికి ఉంగరం తొడిగిన మర్దోక్.. 'నేను మళ్లీ ప్రేమలో పడటానికి భయపడ్డాను. కానీ, నాకు తెలుసు ఇదే నా చివరి వివాహమని. చాలా సంతోషంగా ఉంది' అని ప్రకటించారు. ఈ కోరిక తీరకుండానే పెళ్లి రద్దయింది. రెండోభార్య అన్నా మరియామన్ నుంచి విడిపోయాక మర్దోక్ చెల్లించిన రూ.13,930 కోట్లు (1.7 బిలియన్ డాలర్ల ఆస్తి) అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటిగా నిలిచింది.