Rishi Sunak No Confidence Letter : వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు మరో సవాల్ ఎదురైంది. భారత సంతతికి చెందిన హోం మంత్రి సువెల్లా బ్రేవర్మన్‌ను తొలగిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంతో మళ్లీ బ్రిటన్ రాజకీయాల్లో కలకలం రేగింది. ఈ నిర్ణయం వెలువడిన గంటల్లోనే సొంత పార్టీ ఎంపీనే సునాక్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస లేఖను సమర్పించారు.
'రిషి సునాక్‌ను పదవి నుంచి దింపి..'
UK Government No Confidence Motion : ప్రధాని రిషి సునాక్‌కు వ్యతిరేకంగా టోరీ ఎంపీ ఆండ్రియా జెన్‌కిన్స్ అవిశ్వాస లేఖను ఇచ్చారు. హౌస్ ఆఫ్ కామన్స్ వ్యవహారాలను చూసే 1922 కమిటీ ఛైర్మన్ గ్రాహమ్ బ్రాడీకి ఆమె లేఖను సమర్పించారు. అవిశ్వాస లేఖను ఆండ్రియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాను అవిశ్వాస లేఖను సమర్పించానని రిషి సునాక్‌ను పదవి నుంచి దింపి.. ఆయన స్థానంలో నిజమైన కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే సమయం వచ్చిందని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
బోరిస్ జాన్సన్‌కు నమ్మిన బంటు!
మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు నమ్మిన వ్యక్తిగా పేరు ఉన్న ఆండ్రియా.. కేబినెట్ నుంచి సువెల్లా బ్రేవర్మన్‌ను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆమె ఈ అవిశ్వాస లేఖను సమర్పించారు. రిషి సునాక్ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస లేఖలు సమర్పించాలని తోటి టోరీ ఎంపీలను ఆమె అభ్యర్థించారు.
అవిశ్వాస లేఖ రావడం ఇదే తొలిసారి!
No Confidence Motion Rishi Sunak : సునాక్ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయనపై అవిశ్వాస లేఖ రావడం ఇదే తొలిసారి. అయితే దీనిపై ఇప్పుడే ఆయన అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. పార్టీకి చెందిన మొత్తం ఎంపీల్లో 15శాతం మంది తాము కొత్త నాయకుడిని కోరుకుంటున్నామంటూ లేఖలు పంపితే అప్పుడు కన్జర్వేటివ్ పార్టీలో రిషి నాయకత్వంపై విశ్వాస పరీక్ష ఓటింగ్ నిర్వహిస్తారు.
సునాక్ ప్రతిపాదనలకు రాజు ఆమోద ముద్ర
మరోవైపు బ్రిటన్ విదేశాంగ మంత్రిగా డేవిడ్ కామెరూన్, హోం మంత్రిగా జేమ్స్ క్లెవర్లీని నియమిస్తూ ప్రధాని రిషి సునాక్ చేసిన ప్రతిపాదనలకు రాజు ఛార్లెస్ ఆమోదముద్ర వేసినట్టు 10 డౌనింగ్ స్ట్రీట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్రిటన్ విదేశాంగ మంత్రిగా తన నియామకాన్ని అంగీకరిస్తున్నట్లు డేవిడ్ కామెరూన్ తెలిపారు. కష్ట సమయంలో ప్రధాన మంత్రి రిషి సునాక్‌కు మద్దతు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రిషి సునాక్ సమర్థమైన ప్రధాని అని తాను నమ్ముతున్నట్లు కామెరూన్ తెలిపారు. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నానని స్పష్టం చేశారు.
బ్రిటన్ ప్రధాని నివాసంపై కారుతో దాడి! రిషి సునాక్‌కు తప్పిన ముప్పు
సునాక్ ప్రభుత్వానికి షాక్.. ఉపఎన్నికల్లో ఓటమి.. 2025లో గట్టిపోటీ తప్పదా?