అగ్రరాజ్యంలో రాజకీయ వేడిని రాజేసిన మధ్యంతర ఎన్నికలపై వెలువడుతున్న సర్వే ఫలితాలు డెమొక్రాట్లకు ఆశనిపాతంలా మారాయి. బైడెన్ రెండేళ్ల పాలనకు రిఫరెండంగా భావిస్తున్న ఈ మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమొక్రాట్లకు షాక్ తగిలే అవకాశం ఉందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ప్రతినిధుల సభపై రిపబ్లికన్లకు నియంత్రణ లభించే అవకాశం ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన చాలా చోట్ల రిపబ్లికన్ల జోరు కనిపిస్తోంది.
డెమొక్రాట్ల ఆధీనంలో ఉన్న చాలా సీట్లు రిపబ్లికన్లకు దక్కే అవకాశం ఉందని కూడా సర్వేలు తెలిపాయి. ఇదే జరిగితే ప్రతినిధుల సభ అధిపత్యం రిపబ్లికన్లకు దక్కి బైడెన్ కార్యవర్గ అజెండా అమలులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కాకపోతే ద్రవ్యోల్బణం కారణంగా ఎన్నికలకు ముందు డెమోక్రాట్లు భావించినంత ఘోరమైన ఫలితాలు మాత్రం రావని సర్వేలు చెప్పడం అధికారిక పార్టీకి కాస్త ఊరటనిస్తోంది. ఇక పెన్సిల్వేనియా, జార్జియా, నెవాడ, అరిజోనాల్లో సెనెట్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిసాంటిస్ ఈ సారి విజయం దక్కించుకుంటారని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ సారి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో దాదాపు 46 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లో మూడోవంతు అంటే 35 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితోపాటు 36 రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికకు ఓటింగ్ జరిగింది. సాధారణంగా అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికారిక పార్టీ ఎప్పుడూ అధిక సీట్లు సాధించదు. కానీ, అమెరికాలో అబార్షన్లపై సుప్రీం కోర్టు తీర్పు కారణంగా ఈ సారి గండం గట్టెక్కుతామని డెమోక్రాట్లు ఆశించారు. కానీ, అధిక ద్రవ్యోల్బణం వారి ఆశలను దెబ్బతీసింది.
ఇదీ చదవండి:'అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాం.. ఇకపై కూడా కొనసాగిస్తాం'.. రష్యా వ్యాపారి కీలక వ్యాఖ్యలు
నేపాల్‌లో భారీ భూకంపం.. ఆరుగురు మృతి.. భారత్‌ను తాకిన ప్రభావం!