Rahul Gandhi US tour : భారత్లో విపక్ష పార్టీలు ఐక్యంగానే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఇందుకు అవసరమైన కార్యాచరణ జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో రహస్య మార్పులు జరుగుతున్నాయని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ప్రజల్నే ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ... వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో మీడియాతో ముచ్చటించారు. రాబోయే రెండేళ్లలో కాంగ్రెస్ మంచి పనితీరు కనబరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలను ప్రస్తావించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పటానికి.. మరో మూడు, నాలుగు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల వరకు వేచి చూడాలన్నారు.
"ప్రతిపక్షాలు బాగా ఐక్యంగా ఉన్నాయి. ప్రతిపక్షాల పార్టీలతో మరింత ఐక్యత కోసం చర్చలు జరపుతున్నాయి. ఆ దిశగా మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సంక్లిష్టమైన చర్చ ఎందుకంటే....మేం ఇతర ప్రతిపక్ష పార్టీలతో కూడా పోటీపడే స్థానాలు ఉన్నాయి. అందుకోసం ఇరువురం ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ తప్పకుండా జరుగుతుందని విశ్వసిస్తున్నా."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
దేశంలో మతస్వేచ్ఛ, మీడియా స్వతంత్రత, మైనారిటీల సమస్యలు సహా వివిధ అంశాలపై రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య సంస్థలను స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు. పత్రికాస్వేచ్ఛపై నియంత్రణ ఉందని చెప్పారు. తనకు వినిపించినవన్నీ నిజాలేనని తాను నమ్మనని చెప్పుకొచ్చారు. దేశంలోని వ్యవస్థలను బలహీనం చేశారని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారన్న విషయంపై వివరణ ఇచ్చారు.
"భారత్లో ఇప్పటికే బలమైన వ్యవస్థ ఉంది. కానీ ఈ వ్యవస్థను బలహీనం చేశారు. నియంత్రణలో ఉండకుండా, ఒత్తిడికి గురికాకుండా పనిచేసే స్వతంత్ర సంస్థలు ఉండాలి. భారత్లో ఇలాంటి సంస్థలు ఉండటం ఓ నియమం. కానీ ఈ నియమం ఉల్లంఘిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సంస్థల స్వతంత్రతను వెనువెంటనే పునరుద్ధరిస్తాం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
'ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మా వైఖరి అదే'
అంతర్జాతీయ సంబంధాలపైనా మాట్లాడారు రాహుల్. భారత్, అమెరికా మధ్య మెరుగైన సంబంధాలు ఉండటం చాలా ముఖ్యమని రాహుల్ అభిప్రాయపడ్డారు. రక్షణ రంగంలోనే కాకుండా.. ఇతర అంశాల్లోనూ ఇరుదేశాల మధ్య సహకారం పెరగాలని చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తమ దృక్ఫథం.. భారత ప్రభుత్వ వైఖరి ఒక్కటేనని చెప్పారు. భారత్కు రష్యాతో ఉన్న అత్యంత సన్నిహితమైన సంబంధాలను ఎవరూ కాదనలేరని తెలిపారు.
'ఆడియన్స్ లేకే... విదేశాలకు'
అయితే, రాహుల్ అమెరికా పర్యటనపై బీజేపీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ నేతల సభలకు దేశంలో ఆడియన్స్ కరవయ్యారని, అందుకే విదేశాలకు వెళ్తున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఎద్దేవా చేశారు. విదేశాల్లో 100- 200 మందిని పోగేసి.. గదుల్లో స్పీచులు ఇస్తున్నారని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లి తమ దేశంపై విమర్శలు చేసే వారు ఉంటారా? అని ప్రశ్నించారు. ఏ రాజకీయ నాయకులు అలా చేయరని మంత్రి చెప్పుకొచ్చారు.