Prigozhin Death Russia President Putin : 'నేను దేనినైనా క్షమిస్తాను కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం క్షమించను' రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివి. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రత్యర్థులను తనకు ఎదురు తిరిగిన వారిని అంత తేలిగ్గా వదిలిపెట్టరని పేరున్న పుతిన్.. వాగ్నర్ తిరుగుబాటును వెన్నుపోటుగా, రాజద్రోహంగా అభివర్ణించారు. అయినా ప్రిగోజిన్‌ను మాత్రం వెంటనే క్షమించారు. తిరుగుబాటు పూర్తయిన రెండు నెలల తర్వాత ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. కానీ, పలు ఇంటెలిజెన్స్ సంస్థలు, అగ్రదేశాల నాయకులు మాత్రం ప్రిగోజిన్ హత్యేనని, దీని వెనక పుతిన్ హస్తం ఉందని అంచనా వేస్తున్నాయి. ప్రిగోజిన్‌ను పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసి.. ప్రమాదంలా చిత్రీకరిస్తున్నారని అమెరికా సహా చాలా దేశాలు అనుమానిస్తున్నాయి.
Prigozhin Death America Prediction : వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్‌ను హత్య చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. కూలిపోవడానికి ముందే విమానంలో భారీ పేలుడు జరిగి ఉంటుందని పేర్కొంది. క్షిపణిని ఉపయోగించి విమానాన్ని కూల్చేశారనే వాదనను అమెరికా నిఘా వర్గాలు కొట్టిపారేశాయి. విమానంలో పేలుడు వల్ల ప్రిగోజిన్ మరణించి ఉంటాడని పెంటగాన్ ప్రతినిధి పాట్ రైడర్ అభిప్రాయపడ్డారు. ప్రిగోజిన్‌ది హత్యేనని వాగ్నర్ సంస్థకు చెందిన గ్రేజోన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా వెల్లడించింది.
ఈ ప్రమాదంలో ప్రిగోజిన్‌తో పాటు దిమిత్రి ఉత్కిన్, వాగ్నర్ లాజిస్టిక్స్ విభాగం అధిపతి, సిరియాలో గాయపడిన వాగ్నర్ సభ్యుడు, అంగరక్షకులు, విమాన సిబ్బంది ఉన్నారు. సాధారణంగా సైనిక దళాల టాప్ లీడర్లు ఒకే విమానంలో ఎప్పుడూ ప్రయాణం చేయరు. కానీ, ఇక్కడ వాగ్నర్ గ్రూపులోని కీలక నాయకులంతా ఒకే విమానంలో సెయింట్ పీటర్స్ బర్గ్‌కు ఎందుకు బయల్దేరారన్నది కూడా తెలియడం లేదు. ప్రత్యక్ష సాక్షులు రెండు పేలుళ్లను విన్నట్లు గార్డియన్ పత్రిక కథనంలో పేర్కొంది. ఇవన్నీ ప్రిగోజిన్‌ది హత్యే అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అమెరికా నిఘా సంస్థ తెలిపింది.
ఈ ఏడాది జూన్ 23వ తేదీన ప్రిగోజిన్ రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దానిని ఉపసంహరించుకొని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో రాజీపడ్డారు. ఈ ఘటనకు సరిగ్గా రెండు నెలలు పూర్తయిన సమయంలో ప్రిగోజిన్ విమానం కూలి మరణించారు. వాస్తవానికి వాగ్నర్ బృందానికి చెందిన మరో విమానం కూడా మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణించింది. ఫ్లయిట్ రాడార్ 24 సంస్థ కూడా ప్రిగోజిన్ విమానం ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించలేకపోయింది. దీంతో అక్కడ జామర్లు ఉన్నాయని భావిస్తున్నారు. మరో విధానంలో విమానం ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది. ఈ మార్గంలో కుంజెంకినో-2 మిలటరీ బేస్ ఉంది.
ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారన్న వార్తతో.. వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రయాణించిన విమానయాన సంస్థ స్పందించింది. ప్రిగోజిన్ ప్రయాణించిన ఎంబ్రాయర్ లెగస్సీ 600 జెట్‌లో ప్రమాదం ముందు వరకు ఎటువంటి సమస్యను గుర్తించలేదని బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్ విమాన తయారీ సంస్థ పేర్కొంది. గత 20 ఏళ్లలో ఈ రకం విమానాల్లో జరిగిన రెండో ప్రమాదం ఇదని వెల్లడించింది. కాకపోతే 2019 నుంచి తాము ఈ విమానానికి సర్వీసులు అందించడం లేదని వివరించింది.
Kremlin Denies Prigozhin Murder : మరోవైపు వాగ్నర్ కిరాయి సైన్యం పగ్గాలు ఆండ్రీ ట్రోషేవ్, అలెగ్జాండర్ కుజనెత్సోవ్‌కు దక్కవచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎంఐ6 మాజీ సభ్యుడు క్రిస్ స్టీలే వెల్లడించారు. వీరికి వాగ్నర్ తరఫున ఉక్రెయిన్, ఆఫ్రికా-సిరియా ఆపరేషన్లలో మంచి అనుభవం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రిగోజిన్‌ను రష్యానే హత్య చేసిందన్న వార్తలను ఆ దేశం ఖండించింది. అది విమాన ప్రమాదమే అని స్పష్టం చేసింది.
భారత్‌లో జరగనున్న జీ 20 సమావేశానికి పుతిన్ దూరం..
Putin India G20 : సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న జీ 20 దేశాధినేతల సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ గైర్హాజరు కానున్నారు. భారత్‌లో జరిగే జీ 20 సమావేశానికి పుతిన్ హాజరవడం లేదని క్రెమ్లిన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో రష్యా.. యుద్ధనేరాలకు పాల్పడుతోందన్న అభియోగాలతో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు.. పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఐసీసీలో భారత్‌కు సభ్య దేశం కాదు. అయినా ఇలాంటి సమయాల్లో విదేశాల్లో పర్యటించడం వంటి సాహసోపేత నిర్ణయాలకు దూరంగా ఉండాలని పుతిన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీసీలో సభ్యదేశమైన దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే హాజరయ్యారు. జీ 20కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవుతారా లేదా.. పూర్తిగా గైర్హాజరవుతారా అన్న దానిపై క్రెమ్లిన్ స్పష్టత ఇవ్వలేదు.
Vivek Ramaswamy Polls : అమెరికాలో వివేక్ రామస్వామి హవా.. రిపబ్లికన్ డిబేట్లో టాప్.. విరాళాల వెల్లువ
PM Modi Gets Highest Civilian Award : మోదీకి మరో దేశ అత్యున్నత పురస్కారం