Plastic in Blood: పుడమిపై భారీ కాలుష్యకారకాల్లో ప్లాస్టిక్ ముఖ్యమైంది. ఈ వ్యర్థాలు భారీ పరిమాణంలో నేల నుంచి సముద్రంలోకి చేరుతున్నాయి. వీటిలో చిన్నపాటి రేణువులను సూక్ష్మ ప్లాస్టిక్‌లుగా పేర్కొంటారు. ఇవి 5 మిల్లీమీటర్ల కన్నా చిన్నగా ఉంటాయి. ఇవి ప్రమాదకరంగా పరిణమించాయి. గతంలో ఇవి పేగుల వంటి అవయవాల్లో కనిపించాయి. చేపలు, ఇతర మత్స్య సంపదలోనూ వెలుగు చూస్తున్నాయి. మానవ రక్తంలో వీటికి సంబంధించిన సూక్ష్మ రేణువులు కనిపించడం ఇదే మొదటిసారి.
ఎక్కడ.. ఎన్ని?
- నెదర్లాండ్స్‌లోని పరిశోధక బృందం 22 మంది నుంచి సేకరించిన రక్త నమూనాలను పరిశీలించింది. 17 శాంపిళ్లలో ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి.
- సగం శాంపిళ్లలో పాలీఇథలీన్ టెరెప్టథలేట్ (పీఈటీ) రేణువులు ఉన్నాయి. వీటిని పానీయాల బాటిళ్ల తయారీలో వాడుతుంటారు.
- ఆహార ప్యాకేజింగ్‌లో వాడే పాలీస్టరిన్ రేణువులు 36 శాతం శాంపిళ్లలో కనిపించాయి.
- ప్లాస్టిక్ సంచుల తయారీకి ఉపయోగించే పాలీఇథలీన్ రేణువులు 23 శాతం నమూనాల్లో వెలుగు చూశాయి.
మనిషిలోకి ఎలా చేరుతున్నాయి?
గాలి, ఆహారం, పానీయాల ద్వారా ఈ ప్లాస్టిక్‌లు మానవ శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి.
ఇళ్లలో జాగ్రత్త!
ప్లాస్టిక్ రేణువుల తాకిడిని తప్పించుకోవాలంటే ఇళ్లల్లో మంచి వెంటిలేషన్ ఉండాలని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరుబయట కన్నా ఇళ్లల్లోనే ఇవి ఎక్కువగా పేరుకుపోతున్నట్లు చెబుతున్నారు. ఆహారం, పానీయాలపై ఇవి పడకుండా వాటిని కప్పి ఉంచాలంటున్నారు.
ఆందోళనకరమే..
పరిశీలించిన శాంపిళ్లలో.. మిల్లీలీటరు రక్తంలో 1.6 మైక్రోగ్రాముల మేర ఈ రేణువులు ఉన్నాయి. ఇది ఆందోళనకర పరిమాణమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి రక్తప్రవాహం ద్వారా శరీరం మొత్తం రవాణా అవుతాయని, అవయవాల్లో పేరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో దీనివల్ల ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి స్పష్టంగా వెల్లడికాలేదు. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య స్థాయి నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఇది ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ఉక్రెయిన్ యుద్ధంలో తొలిదశ పూర్తి.. అదే మా లక్ష్యం'