Imran Khan News: మార్చి 8న పాకిస్థాన్ ప్రతిపక్షాలు.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చినప్పటి నుంచి అనేక మలుపులు తిరుగుతున్న ఆ దేశ రాజకీయ పరిణామాలు చివరి అంకానికి చేరుకున్నాయి. న్యాయస్థానం చేతిలో మళ్లీ ఊపిరి పోసుకున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ నేడు(శనివారం) ఉదయం 10.30కు సమావేశం కానుంది. విదేశీ కుట్ర పేరుతో చట్టసభ రద్దుకు సాహసించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. పాక్ జాతీయ అసెంబ్లీ శుక్రవారం విడుదల చేసిన ఆరు పాయింట్ల అజెండా మేరకు నాలుగో అంశంగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ చేపడతారు. 342 స్ధానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో మెజార్టీకి 172 ఓట్లు అవసరం. మిత్రపక్షాలు దూరం కావడం సహా, సొంత పార్టీకి చెందిన సభ్యులు కూడా దూరం కావడంతో ఇమ్రాన్ సర్కార్ మైనార్టీలో పడింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే విశ్వాస పరీక్ష ద్వారా పదవి కోల్పోయిన తొలి పాక్ ప్రధాని ఇమ్రాన్ అవుతారు. అటు విశ్వాస పరీక్షకు ముందే ఇమ్రాన్ రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. తన ఓటమిని ఇమ్రాన్ పరోక్షంగా అంగీకరించారు.
శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే సమయంలో శాంతియుత నిరసనలు తెలపాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత్ పేరును ప్రస్తావించిన ఇమ్రాన్ ఖాన్.. సార్వభౌమ దేశం అని కొనియాడారు. ప్రపంచంలోని మరే దేశం భారత్‌ను శాసించలేదని అన్నారు. అటు ఇమ్రాన్ ప్రభుత్వ ఓటమి ఖాయం కావడం వల్ల కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాలు యత్నాలు మొదలుపెట్టాయి. కొత్త ప్రధానిగా విపక్షాలు బలపరుస్తున్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ప్రమాణం చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 'న్యాయవ్యవస్థను గౌరవిస్తా.. కానీ'