Pakistan Terror Attack Today : పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఘటనలో 23 మంది సైనికులు మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ తాలిబన్ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న తెహ్రీక్-ఎ-జిహాద్-పాకిస్థాన్ అనే ఉగ్రవాద సంస్థ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది.
ఇదీ జరిగింది
పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని దారాబన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సైనిక స్థావరంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. మంగళవారం తెల్లవారుజామున పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కును ఆరుగురు ఉగ్రవాదులు సైనిక స్థావరంలోని భవనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో 23 మంది సైనికులు చనిపోయారని ఆర్మీ ప్రకటించింది.
'మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చు'
Recent Terror Attack In Pakistan : మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు తెలిపారు. ఈ దాడిలో భవనంలోని కూలిపోయిందని చెప్పారు. అయితే దాడికి పాల్పడ్డ వారందినీ భద్రతాదళాలు హతమార్చాయని చెప్పారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఘటన కారణంగా స్థానికంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. జిల్లా ఆస్పత్రుల్లో అత్యవసర స్థితిని ప్రకటించారు.
పండుగ వేళ ఆత్మాహుతి దాడి
కొన్నినెలల క్రితం, పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి 55 మంది బలయ్యారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్థాన్ రాష్ట్రం మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు వద్ద ఈ పేలుడు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహ్మద్ ప్రవక్త జయంతి (ఈద్ మిలాదున్ నబీ) సందర్భంగా ర్యాలీ నిర్వహించేందుకు స్థానికులంతా జిల్లాలోని మదీనా మసీదు దగ్గర గుమిగూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డీఎస్పీ కారు దగ్గరగా వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. శక్తిమంతమైన బాంబు పేలుడు ధాటికి 55 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు.