మొన్న శ్రీలంక.. నేడు పాకిస్థాన్! చైనాపై అధికంగా ఆధారపడ్డ పాక్ కూడా శ్రీలంకలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఆ దేశాన్ని ఆర్థిక సమస్యలెంతగా చుట్టుముట్టాయంటే.. అమెరికాలోని తమ పాత రాయబార కార్యాలయాలను అమ్మేసేంతగా! కొత్తగా బల్బులు, ఫ్యాన్ల తయారీని ఆపేసేంతగా!
దాయాది పాకిస్థాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతోపాటు భౌగోళిక, రాజకీయ సమస్యలతో ఆ దేశం విలవిల్లాడుతోంది. ఇంధన పొదుపు కోసమని ప్రస్తుతం పాక్‌వ్యాప్తంగా విద్యుత్ వాడకంపై ఆంక్షలు విధించారు. దేశంలో సగం వీధిలైట్లను ఆపేశారు. కొద్దిరోజులపాటు బల్బుల తయారీ, ఫ్యాన్ల తయారీపైనా నిషేధం విధించారు. రాత్రి 8.30 గంటలకల్లా అన్ని మార్కెట్లు, దుకాణాలు, మాల్‌లు మూసేస్తున్నారు. పెళ్లిళ్లను రాత్రి 10.30 గంటలలోపే పూర్తి చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతంపైగా విద్యుత్ వాడకాన్ని తగ్గించేశారు. వీటన్నింటివల్ల సుమారు 600 కోట్ల రూపాయలు ఆదా చేస్తామన్నది ప్రభుత్వం అంచనా. ఇక అమెరికాలోని పాత రాయబార కార్యాలయాలను పాక్ అమ్మకానికి పెట్టింది కూడా.
దెబ్బతీసిన ద్రవ్యోల్బణం, వరదలు..
చాలాకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, చైనా సాయంపై ఆధారపడుతూ వచ్చిన పాకిస్థాన్‌కు నిరుడు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచాన్ని తాకిన ద్రవ్యోల్బణం భారీ ప్రభావం చూపింది. పాక్‌లో ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంతగా 42 శాతం దాకా పెరిగిందంటున్నారు.
- దీనికి.. గత జూన్‌లో వచ్చిన వరదలు, వర్షాలు తోడై పరిస్థితి మరింత దిగజారింది. భారీ వరదలకు దేశంలో మూడోవంతు మునిగిపోయింది. దాదాపు 3 వేలకోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా.
- దీనివల్ల ఎగుమతులు తగ్గి, ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఎగుమతులు తగ్గటంతో విదేశీమారక నిల్వలు తగ్గాయి.
నెలకు సరిపడానే...
- ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద విదేశీమారక నిల్వలు(5.5 బిలియన్ డాలర్లు) 3 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే ఉన్నాయి.
- ఆ దేశ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఒక డాలర్‌కు 228 రూపాయిలుగా నడుస్తోంది.
- సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), సౌదీ అరేబియాల చుట్టూ పాక్ పరుగెడుతోంది. సౌదీ ఇప్పటికే 8 బిలియన్ డాలర్ల సాయం చేసినా, సరిపోని పరిస్థితి.
- ఐఎంఎఫ్ విడతలవారీగా 800 కోట్ల డాలర్ల మేరకు రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. అయితే అందుకు బోలెడన్ని షరతులు విధిస్తోంది. ముఖ్యంగా పన్నులు పెంచాలంటోంది. వాటిని అంగీకరిస్తే ప్రజలపై భారం పడుతుంది. అసలే రాజకీయంగా, ఆర్థికంగా నలిగిపోతున్న ప్రజానీకం తిరగబడితే సమస్యలు తీవ్రమవుతాయనే భయం నాయకుల్లో ఉంది. దీంతో ఐఎంఎఫ్ సాయం అనిశ్చితిలో పడింది. షరతులపై పట్టుబట్టకుండా ఎంతోకొంత అప్పుఇచ్చి ఆదుకోవాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐఎంఎఫ్‌కు తాజాగా విజ్ఞప్తి చేశారు.
- 2023 జూన్ వరకు అప్పులు, ఇంధన చెల్లింపులతో పాటు ఇతర ఖర్చుల కోసం 30 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా. దీంతో మరోమారు సౌదీనే ఆశ్రయించాలని పాక్ నేతలు భావిస్తున్నారు.
- గత ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రధానమంత్రి పదవి నుంచి దించేసిన తర్వాత రాజకీయంగా కూడా దేశంలో అనిశ్చిత పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి.
చేజారుతున్న ఖైబర్..
పులిమీద పుట్రలా.. అఫ్గానిస్థాన్ నుంచీ పాక్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి. సరిహద్దుల్లోని పుష్తూన్ తెగ ప్రాంతాలపై పట్టుబిగించటానికి తాలిబన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పాక్‌లోని ఖైబర్ పక్తున్‌క్వా రాష్ట్రంపై కాబుల్ కన్నేసింది. తాలిబన్ల మద్దతున్న తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) దళాలు పాక్ సైన్యంతో తరచూ ఘర్షణకు దిగుతున్నాయి. దీంతో సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకప్పుడు తాము మద్దతిచ్చిన తాలిబన్లే ఇప్పుడు పక్కలో బల్లెంగా మారటం పాక్ నేతలకు ఇబ్బందికరంగా తయారైంది.