North Gaza Evacuation : ఇజ్రాయెల్ దాడులతో గాజాలో నెత్తుటేర్లు పారుతున్నాయి. నిన్నామొన్నటి దాకా తమతో పాటే ఉన్న బంధుమిత్రులు.. రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉండటాన్ని చూడటం, గాజా పౌరులకు సాధారణంగా మారింది. ప్రాణాలతో ఉండేందుకు ప్రజలు ఉత్తర గాజాను వీడి దక్షిణానికి వెళ్లడం ఇంకా కొనసాగుతోంది. ఇంధనం లేకపోవడం వల్ల ఎక్కువ మంది.. రిక్షాలు, గుర్రం, గాడిద బళ్లపైనే ప్రయాణం సాగిస్తున్నారు. చాలా మంది కట్టుబట్టలతో చేతిలో పిల్లలను పట్టుకుని కాలి నడకనే తరలివెళుతున్నారు. గాడిదలు, గుర్రాలు కూడా మరెన్నో రోజులు బతకవని వాటి యజమానులు చెబుతున్నారు. యుద్ధం వల్ల వాటికి దాణా ఎక్కడా దొరకట్లేదని ఆవేదన చెందుతున్నారు.
ఉత్తరగాజాను ఖాళీ చేయాలని కొన్ని వారాల క్రితమే ఇజ్రాయెల్ అక్కడి పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 11 లక్షల వరకు జనాభా దక్షిణానికి తరలిపోయారు. మరో 3 నుంచి 4 లక్షలమంది ఉత్తరగాజాలోనే మిగిలిపోయారు. ఉత్తరగాజాలోకి ఇజ్రాయెల్ సేనలు ప్రవేశించి అక్కడ భీకర పోరు జరుగుతున్న వేళ అక్కడి ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఉత్తరగాజా పౌరులు దక్షిణ గాజా వెళ్లేందుకు ఇజ్రాయెల్ కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల వారంతా దక్షిణ గాజాకు పయనమయ్యారు. తరలివెళ్లిన వారిలో ఎక్కువమంది దక్షిణ గాజాలోని ఖాన్‌యూనిస్ నగరంలో తలదాచుకుంటున్నారు. దీంతో అక్కడ ఆహారం, నీరు, మరుగుదొడ్ల సంక్షోభం తీవ్రంగా నెలకొంది.
గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్.. ఆ ప్రాంతాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించింది. మొదట ఉత్తరగాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. అక్కడి హమాస్ స్థావరాలను, సొరంగాల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరగాజా.. తర్వాత దక్షిణగాజాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటుందన్న భయం.. గాజా వాసులను పట్టిపీడిస్తోంది.
గాజా ఆరోగ్య పరిస్థితులపై WHO ఆందోళన
అంతకుముందు.. గాజాలోని ప్రధాన ఆసుపత్రి అల్-షిఫాలో భయంకరమైన, ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అల్-షిఫా ఆస్పత్రిలో విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని.. ఆహారం, నీటి కొరత పతాకస్థాయికి చేరిందని WHO వెల్లడించింది. ఆసుపత్రి వద్ద నిరంతర కాల్పులు, బాంబు దాడులు జరుగుతున్నాయని.. ఇప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అల్ ఫిషాలో ఇక వైద్య సేవలు అందించడం కష్టమేనని WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
బిక్కుబిక్కుమంటూ 14వేల మంది- ఆస్పత్రిలో కరెంట్ కట్, జనరేటర్ కూడా లేక
అతిపెద్ద ఆస్పత్రిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు- పసికందుల ప్రాణాలకు ముప్పు?