ఆర్థికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డుకు అమెరికాకు చెందిన ముగ్గురు ఎకానమిస్ట్లు ఎంపికయ్యారు. బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ దిబ్విగ్‌లకు అవార్డు ప్రకటించింది నోబెల్ కమిటీ. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనలకు వీరికి అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన, సాహిత్య రంగాల్లో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. శాంతి బహుమతి విజేతలను సైతం వెల్లడించారు. ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రకటనతో ఈ ఏడాది అన్ని రంగాల్లో అవార్డుల విజేతలను ప్రకటించినట్లైంది.
తాజాగా అవార్డు దక్కించుకున్న ముగ్గురూ ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో బ్యాంకుల పాత్రపై కీలక పరిశోధనలు జరిపారు. బ్యాంకుల పతనాన్ని నివారించడం ఎందుకు ముఖ్యం? అనేది వారి పరిశోధనల్లో ముఖ్యాంశం. బ్యాంకులు ఎందుకు ఉన్నాయి? ఆర్థిక సంక్షోభాల సమయంలో వాటిపై తక్కువ ప్రభావం పడేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బ్యాంకుల పతనాలు.. ఆర్థిక సంక్షోభాలకు ఏ విధంగా దారితీస్తాయి? తదితర ఆధునిక బ్యాంకింగ్ పరిశోధనలకు ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు 1980ల్లోనే పునాదులు వేశారు.
ఆర్థిక మార్కెట్లను నియంత్రించడంలో, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో వారి విశ్లేషణలు ఆచరణాత్మక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. డిపాజిట్లు, డిపాజిట్ ఇన్సూరెన్స్‌లు, బ్యాంకు రుణాల విషయంలో డైమండ్, డైబ్‌విగ్ పరిశోధనలు బ్యాంకులకు ఎంతో మేలు చేశాయి. పురస్కార గ్రహీతల విశ్లేషణలు.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు, బెయిలవుట్‌లను నివారించగల సామర్థ్యాన్ని మెరుగుపరిచాయని నోబెల్ ప్రైజ్ కమిటీ ఛైర్మన్ టోర్ ఎల్లింగ్‌సెన్ చెప్పారు.
ఏ అవార్డు ఎవరికి దక్కిందంటే..?
స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వైద్య నోబెల్‌కు ఎంపిక చేశారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. 'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్'లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. రసాయనశాస్త్రంలో నోబెల్ అవార్డును ముగ్గురు శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. సాహిత్య రంగంలో ఫ్రెంచ్ రచయిత్రి అనీ ఎర్నాక్స్ నోబెల్ అవార్డును దక్కించుకున్నారు. మానవహక్కుల కోసం పాటుపడిన బెలారస్‌కు చెందిన అలెస్ బియాలియాట్స్కీ, రష్యన్ మానవ హక్కుల సంస్థ అయిన 'మెమోరియల్', ఉక్రెయిన్ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ అయిన 'సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్'కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించింది.
నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.