No-confidence motion against Imran Khan: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు భావించారు. కానీ, సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సభ సోమవారానికి వాయిదా పడింది. ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై మార్చి 28నే చర్చ జరుగనుంది. దీంతో అప్పటివరకు ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం లభించినట్లుయ్యింది.
దేశంలో ఆర్థిక సంక్షోభానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) కారణమంటూ అక్కడి ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వంపై మార్చి 8న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్‌లో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో నేడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఇది చర్చకు వచ్చే అవకాశం ఉందని భావించారు. దీంతో విపక్ష పార్టీ నేతలందరూ సభకు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత షెహ్‌బాజ్ షరీఫ్, పీపీపీ ఛైర్మన్ బిలాల్‌వాల్ భుట్టో-జర్దారీతోపాటు పీపీపీ ఉపఛైర్మన్ ఆసిఫ్ ఆలీ జర్దారీ వంటి అగ్రనేతలు పార్లమెంటుకు హాజరైనట్లు పాక్ మీడియా వెల్లడించింది.
ఇదే సమయంలో సంకీర్ణ ప్రభుత్వంలోని 23 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తాను చివరి వరకు పోరాడతానని.. ముందస్తుగా రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి ముగింపు పలికేందుకు ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ రషీద్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2023 చివరలో జరగాల్సి ఉండగా.. ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలాఉంటే, అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న పాక్ ప్రభుత్వానికి దేశ ప్రజలంతా అండగా నిలవాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరుతున్నారు. ఇందులో భాగంగా ఈనెల 27న ఇస్లామాబాద్ పరేడ్ మైదానంలో జరిగే సభకు హాజరై ప్రజాబలాన్ని ప్రదర్శించాలంటూ పిలుపునిచ్చారు. మార్చి 28న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో దాని నుంచి గట్టెక్కేందుకు ఇమ్రాన్ ఖాన్ ఇటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారత్ ఆపన్నహస్తం