వివాదాస్పద, స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. కైలాస పేరుతో ఆయన సృష్టించుకున్న ప్రత్యేక 'దేశం' తరఫున ఇద్దరు ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్నారు. తనను తాను విజయప్రియ నిత్యానందగా పరిచయం చేసుకున్న ఆ మహిళా ప్రతినిధి.. భారత్‌పై ఆరోపణలు చేశారు. నిత్యానందను భారత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. జెనీవాలో జరిగిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (సీఈఎస్‌సీఆర్) సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"హిందువుల కోసం ఏర్పాటైన తొలి సార్వభౌమ దేశం కైలాస. హిందూమతానికి చెందిన అత్యున్నత గురువు నిత్యానంద పరమశివం దీన్ని నెలకొల్పారు. హిందూ సంప్రదాయాలను, హిందూ నాగరికతను ఆయన పునరుద్ధరిస్తున్నారు. ఆదిశైవులు అనే వ్యవసాయ తెగలకూ ఆయన పునరుజ్జీవం పోస్తున్నారు. ఆదిశైవ తెగకు ఆయనే అధినేత" అని మహిళా ప్రతినిధి విజయప్రియ.. ఐరాస సమావేశంలో పేర్కొన్నారు. అనంతరం కైలాస నుంచే వచ్చిన మరో ప్రతినిధి ఈఎన్ కుమార్ సైతం ఐరాస సమావేశంలో మాట్లాడారు.
నిత్యానందపై భారత్‌లో అనేక కేసులు ఉన్నాయి. అత్యాచారం, అపహరణ వంటి కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులకు సంబంధించి ఆయనపై నాన్ బెయిలెబుల్ వారెంట్ సైతం జారీ అయింది. 2019లో దేశం నుంచి పారిపోయిన నిత్యానంద.. ఆ తర్వాత తిరిగి రాలేదు. అయితే, 2020లో తాను ఓ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంచలన ప్రకటన చేశారు నిత్యానంద. దానికి కైలాస అని నామకరణం చేశారు.
కైలాస ఎక్కడుంటుందంటే?
కైలాస అనేది ఓ ద్వీపం. ఈక్వెడార్ తీరానికి దగ్గర్లో ఈ ద్వీపం ఉంటుందని సమాచారం. కైలాసకు స్వతంత్ర జెండా, రిజర్వ్ బ్యాంక్ ఉంది. ఆ దేశం పేరుతో పాస్‌పోర్ట్ సైతం జారీ చేస్తున్నారు. కైలాస రిజర్వ్ బ్యాంక్ ఆ దేశం కోసం కరెన్సీని ముద్రిస్తోంది. ఐరాస సమావేశాల్లో తమ దేశం పేరును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యూఎస్‌కే) గా పేర్కొన్నారు. ఈ దేశ పౌరసత్వం తీసుకునే వారికి ఆన్లైన్లోనే అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ దేశ 'ఈ-సిటిజెన్షిప్' తీసుకోవచ్చు!