పొగాకు అమ్మకాలపై నిషేధం రద్దు- ప్రభుత్వం కీలక నిర్ణయం - ధూమపానం నిషేధం రద్దు చేసిన న్యూజిలాండ్
New Zealand Smoking Ban : న్యూజిలాండ్‌లో గతంలో తీసుకొచ్చిన ధూమపాన నిషేధాన్ని కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు తప్పుబడుతున్నారు.
Published : Nov 28, 2023, 10:51 PM IST
New Zealand Smoking Ban : న్యూజిలాండ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ధూమపాన నిషేధాన్ని రద్దు చేసింది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం. పన్నుల రాయితీల ద్వారా కోల్పోయిన ఆదాయన్ని తిరిగి పొందటం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రజా ఆరోగ్య సంఘాలు, సామాజిక కార్యకర్తలు, పొగాకు వ్యతిరేక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో న్యూజిలాండ్‌ను పొగాకు రహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో అప్పటి ప్రధాని.. జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ పేరుతో 2009 తర్వాత జన్మించిన వారికి సిరగెట్ల అమ్మకాన్ని నిషేధిస్తూ చట్టాన్ని తీసుకొచ్చారు.
అయితే, సోమవారం న్యూజిలాండ్ 42వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన క్రిస్టోఫర్ లుక్సన్.. పొగాకు ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ధూమపాన విక్రయాలు యథావిధిగా కొనసాగించాలని చెప్పారు. "పొగాకు ఉత్పత్తులపై నిషేధం వల్ల దేశంలో బ్లాక్ మార్కెట్ విస్తరించే ప్రమాదం ఉంది. దేశ వ్యాప్తంగా ధూమపానం చేసే వారి సంఖ్య తగ్గింది. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం తొలగించినా.. వాటి వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం." అని ప్రధాని క్రిస్టోఫర్ లుక్సర్ తెలిపారు.
ఈ నిర్ణయంపై న్యూజిలాండ్ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి అయేషీయా వెరాల్ స్పందించారు. "గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధూమపాన నిషేధాన్ని ప్రపంచం మొత్తం స్వాగతించింది. సుమారుగా 80,000 మంది ప్రాణాలను కాపాడే విధంగా చట్టం చేశాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం పన్నుల తగ్గింపు కోసం ఈ చట్టాన్ని రద్దు చేసింది." అని వెరాల్ మాట్లాడారు. ధూమపాన వ్యతిరేక సంఘాలు కూడా ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిశ్రమల లాభాల కోసం దేశ ప్రజల జీవితాలను పణంగా పెడుతున్నారని అన్నారు.
బీచ్‌లు, పార్కుల్లో ధూమపానంపై నిషేధం
మరోవైపు ఫ్రాన్స్ ప్రభుత్వం పొగాకు సంబంధిత మరణాలను నియంత్రించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. బీచ్‌లు, పార్కులతో పాటు పలు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. పొగాకు ఉత్పత్తులు ఫ్రాన్స్‌లో ఏడాదికి దాదాపు 75వేల మంది మరణాలకు కారణమవుతున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి ఆరేలియన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నివారించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రణాళిక చేపట్టనున్నట్లు తెలిపారు.