నేపాల్ రాజధాని కాఠ్మండూ, లలిత్పుర్లో పానీపూరీతో పాటు పలు స్ట్రీట్ ఫుడ్స్ అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. ఆయా మెట్రోపాలిటన్ సిటీల్లో కలరా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వారం రోజులుగా లలిత్పుర్లో కలరా కేసులు భారీగా నమోదువుతుండగా.. తాజాగా ఆ వ్యాధి కాఠ్మండూకు వ్యాపించింది. ఆదివారం నుంచి ఇప్పటివరకు కాఠ్మండూ పరిధిలో 12 కలరా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వ్యాధిని అరికట్టేందుకు అధికారులు అప్రమత్తమై.. ఆంక్షలు విధిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.
కలుషితమైన నీరు, ఆహార పదార్థాల ద్వారా కలరా వ్యాపిస్తుంది. ఇది అంటు వ్యాధి. కలరా సోకిన వారికి తీవ్రమైన విరేచనాలు, వాంతులు అవుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే.. గంటల్లోనే ప్రాణాంతకం అవుతుంది. అందుకే మొగ్గ దశలో ఉన్నప్పుడే వ్యాధిని కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఆహార పరిశుభ్రతను తనిఖీ చేయాలని సంబధింత శాఖను అభ్యర్థిస్తున్నారు.
ఇదీ చదవండి: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?