అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి అరుదైన వైరస్ 'మంకీపాక్స్' కలకలం సృష్టిస్తోంది. మసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదరు వ్యక్తి ఇటీవలే కెనడాకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుప్రతిలో చికిత్స తీసుకుంటున్నాడని, ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, ప్రస్తుతానికి ఒక్క కేసే వెలుగులోకి వచ్చిందని, కంగారుపడాల్సిందేమీ లేదని చెబుతున్నారు. ఇటీవల ఐరోపాలోని పలు దేశాల్లో ఈ మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. యూకే సహా పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాల్లో ఈ వైరస్ బయటపడింది. అమెరికాలో గతేడాది కూడా ఈ కేసులు వెలుగుచూశాయి. నైజీరియాలో పర్యటించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు గతంలో ఈ వ్యాధి బారినపడ్డారు.
ఏంటీ వైరస్..?
మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుంటుంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
లక్షణాలు ఏంటి?
జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు. స్మాల్‌పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందట. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఇదీ చూడండి: 'టీకా వేస్ట్.. ఉప్పు నీళ్లే బెస్ట్'.. ఊర మాస్ చిట్కాలతో కరోనాపై కిమ్ ఫైట్!