Mathematician CR Rao Death : ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక నిపుణుడు డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణారావు (సీఆర్ రావు) (102) కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన.. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గణిత శాస్త్రంలో అందించిన సేవలకు సీఆర్ రావును పద్మవిభూషణ్, ఎస్‌ఎస్ భట్నాగర్ పురస్కారాలు వరించాయి. ఆయన మృతి పట్ల వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు.
CR Rao Biography : దాదాపు 8 దశాబ్దాల పాటు గణిత శాస్త్రానికి విశేష సేవలందించిన డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణారావు.. 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో సీఆర్ రావు బాల్యం గడిచింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ గణితం చేసిన ఆయన.. యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం సీఆర్ రావు అమెరికాలో స్థిరపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు.
సీఆర్ రావు చేసిన పరిశోధనలివే..
CR Rao Contribution In Mathematics : సీఆర్ రావు తన పరిశోధనలో భాగంగా 1945లో మూడు ప్రాథమిక ఫలితాలను విశ్లేషించారు. ఇవి ఆధునిక గణాంక విధానానికి మార్గం సుగమం చేయడంతోపాటు సైన్స్‌లో ఈ గణాంక టూల్స్‌ను భారీగా వాడటానికి ఉపయోగపడ్డాయి. ఈ మూడింటిలో మొదటిది.. క్రామెర్-రావు లోయర్ బౌండ్ (Cramer Rao Lower Bound). ఇది గణాంక పరిమాణాన్ని అంచనా వేయడంలో అత్యుత్తుమ విధానాన్ని సూచించింది. రెండవది రావు- బ్లాక్‌వెల్ సిద్ధాంతం (Rao Blackwell Theorem). ఒక అంచనాను మెరుగైనదిగా మార్చడానికి ఉపయోగపడుతోంది. మూడోది సమాచార జామెట్రీ విస్తృతికి కొత్త ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ అభివృద్ధి. ఇది డేటా నుంచి సమాచారాన్ని మరింత సమర్థంగా సేకరించేందుకు సహాయపడుతుంది.
CR Rao AIMSCS Cutoff : హైదరాబాద్‌లోని సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సంస్థను డాక్టర్ సీఆర్ రావు.. నెలకొల్పారు. ఈ సంస్థ స్టాటిస్టికల్ రంగానికే కాకుండా ఎకనమిక్స్, జెనెటిక్స్, ఆంత్రోపాలజీ తదితర రంగాలకూ విశేష సేవలందించింది.
సీఆర్ రావు అవార్డులు, పురస్కరాలు..
CR Rao Awards Won : 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్న డాక్టర్ సీఆర్ రావు.. 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు (CR Rao Books) రాశారు. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్.. పురస్కారం అందుకున్నారు. యూకే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ బయోమెట్రిక్ సొసైటీకి అధ్యక్షుడిగా పని చేశారు. భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఎన్‌ఎస్ భట్నాగర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకుగానూ ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 అవార్డును (CR Rao Award 2023) వరించింది. 102 ఏళ్ల వయసులో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1945లో కోల్‌కతా మేథమేటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. ఆయన చేసిన కృషి.. ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ అవార్డు ప్రకటనలో కొనియాడింది.
ప్రపంచ ప్రఖ్యాత గణాంక నిపుణుడు సీఆర్ రావుకు అత్యున్నత పురస్కారం..