Malaria Vaccine Approved By WHO : ప్రాణాంతక మలేరియాపై పోరులో మరో కీలక ముందడుగు పడింది. ఆ వ్యాధి నివారణ ప్రయత్నాల్లో దోహదపడే సరికొత్త టీకా వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోద ముద్ర వేసింది. సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాయంతో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. మలేరియా నుంచి ఇది 75శాతానికిపైగా రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది మూడు డోసుల టీకా అని, బూస్టర్ కూడా వేసుకోవచ్చని తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి కొన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మలేరియా ముప్పు ఎక్కువగా ఉన్న చిన్నారుల్లో ఈ టీకా వాడకానికి రెండు నిపుణుల బృందాలు చేసిన సిఫార్సు మేరకు ఆమోద ముద్ర వేసినట్లు ప్రపంప ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. ఘనా, బుర్కినాఫాసోలో అధికారవర్గాలు ఈ వ్యాక్సిన్ ను ఇప్పటికే ఆమోదించాయి.
ఈ మలేరియా వాక్సిన్‌కు సోమవారం యునైటైడ్ నేషన్ హెల్త్ ఎజెన్సీ ఆమోద ముద్ర వేసిందన్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. ఒక మలేరియా పరిశోధకుడిగా సురక్షితమైన వాక్సిన్ తీసుకురావాలనే కల తనకుండేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచం వద్ద రెండు మలేరియా వాక్సిన్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ మలేరియా వాక్సిన్ ధర దాదాపు రెండు డాలర్ల నుంచి నాలుగు డాలర్ల వరకు ఉండొచ్చని టెడ్రోస్ వివరించారు. అయితే ఈ వాక్సిన్ వేసుకున్నప్పటికీ దోమల నుంచి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్..
మల్టిపుల్ స్లీరోసిస్, టైప్-1 మధుమేహం వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు సరికొత్త టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానవుల శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్‌లను శత్రువులుగా గుర్తించి.. వాటిపై దాడి చేయడాన్ని రోగ నిరోధక వ్యవస్థకు సాధారణ టీకాలు నేర్పిస్తాయి. అందుకు భిన్నంగా ప్రత్యేక విలోమ వ్యాక్సిన్‌ను అమెరికాలోని షికాగో యూనివర్సిటీకి చెందిన ప్రిట్జ్‌కర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులార్ ఇంజినీరింగ్ పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. కొన్ని నిర్దిష్ట కణాలకు సంబంధించి రోగ నిరోధక వ్యవస్థ జ్ఞాపకశక్తిని ఈ టీకా చెరిపేస్తుంది. టైప్-1 మధుమేహం, మల్టిపుల్ స్లీరోసిస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో రోగ నిరోధక వ్యవస్థ.. ఆయా వ్యక్తుల ఆరోగ్యకర కణజాలంపై దాడి చేస్తుంది. సంబంధిత జ్ఞాపకశక్తిని కొత్త వ్యాక్సిన్ చెరిపేస్తుంది కాబట్టి ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి.