Luna 25 Crashed On Moon : చందమామ దక్షిణ ధ్రువంపై దిగడానికి రష్యా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టడానికి ముందే కుప్పకూలింది. ల్యాండింగ్‌కు ముందు ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్‌కు చేరడానికి.. శనివారం లూనా-25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తింది. ఫలితంగా నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్ తెలిపింది.
ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన లూనా-25.. గింగిరాలు కొడుతూ చంద్రుడిపై క్రాష్ ల్యాండ్ అయినట్లు.. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. "శనివారం చంద్రుడికి సమీపంగా వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆపరేషన్ సమయంలో అటోమేటిక్ స్టేషన్‌లో అసాధారణ పరిస్థితులు తలెత్తాయి. దీంతో ల్యాండర్ అనియంత్రిత కక్ష్యలో పరిభ్రమించింది. అనంతరం అది చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది." అని రష్యా స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది.
Russia Moon Mission Update : దాదాపు 50 సంవత్సరాల విరామం అనంతరం జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా సన్నద్ధమైంది. ఇందుకోసమే లూనా-25 ప్రయోగాన్ని చేపట్టింది. లూనా-25ను ఈ నెల 11న రష్యాలోకి వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి నింగిలోకి ప్రయోగించింది. 11 రోజుల వ్యవధిలోనే చందమామపై దీన్ని దించేందుకు ప్రణాళికలు రచించుకుంది. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 కంటే ఒకటి, రెండు రోజులు ముందే లునా-25... చందమామ దక్షిణ ధ్రువంపై దిగాల్సి ఉండగా ఈ లోపే ఇలా జరిగింది.
Russia Chandrayaan Mission : చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్ చేతులు రష్యా ప్రయోగించిన లూనా-25లో ఉన్నాయి. డ్రిల్లింగ్ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలను సైతం అందులో పంపించారు. చంద్రయాన్-3, లూనా-25 వ్యోమనౌకలు చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే దిగేందుకు ప్రణాళికులు రూపొందించారు. ఈ నేపథ్యంలో అవి రెండూ ఢీకొనే ప్రమాదం ఉందా అనే సందేహాలు తలెత్తాయి. కాగా, వీటిపై రష్యా స్పష్టతనిచ్చింది. రెండు దేశాల అంతరిక్ష నౌకలు ల్యాండ్ అయ్యే ప్రాంతాలు వేర్వేరనీ, అవి ఢీకొనే ప్రమాదమేం లేదని వెల్లడించింది. కానీ సోమవారమే చంద్రుడిపై రష్యా ల్యాండర్ దిగాల్సి ఉండగా.. అది క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో అందరి కంటే ముందుగా చంద్రుడి దక్షిణ ద్రువంపై అడుగుపెట్టాలనుకున్న రష్యా కల చెదిరిపోయింది. లూనా-25 ప్రయోగం 2021లో చేయాల్సి ఉన్నా.. చాలా సార్లు వాయిదా పడి చివరికి ఇప్పుడు ప్రయోగించారు. తాజా ప్రయత్నంలోనూ రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది.
ISRO Chandrayaan 3 : జాబిల్లికి అడుగు దూరంలో 'విక్రమ్'.. సూర్యోదయం కాగానే ల్యాండింగ్