pakistans new army chief: పాకిస్థాన్ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునిర్ నియమితులయ్యారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఆ పదవికి లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ పేరు ప్రతిపాదించారు. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ బజ్వా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 61 ఏళ్ల బజ్వా పదవీకాలాన్ని ఇప్పటికే మూడేళ్లు పొడిగించారు. ఆయన ఈనెల 29న పదవీ విరమణ చేయనున్నారు.
మరోవైపు, లెఫ్టినెంట్ జనరల్ సహిర్ షమ్‌షాద్ మీర్జాను జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. ఈ మేరకు వీరిద్దరి పేర్లను పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీకి పంపినట్లు రక్షణమంత్రి ఖవాజా అసిఫ్ వెల్లడించారు. ఎలాంటి వివాదానికి తావులేకుండా వారి పేర్లకు అధ్యక్షుడు ఆమోదించారు.
పాకిస్థాన్ సైన్యాధిపతి పదవి చాలా శక్తివంతమైనది. 75 ఏళ్ల పాకిస్థాన్ చరిత్రలో సగంకాలం సైన్యాధిపతులే పరిపాలించారు. ప్రభుత్వం ఉన్నప్పటికీ విదేశాంగ, భద్రతావిధానాల్లో పాక్ సైన్యాధిపతి మాటే నెగ్గుతుంది. పాక్ నిఘా విభాగం ఐఎస్ఐకు గతంలో అధిపతిగా మునీర్ పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనవైపే ప్రధాని మొగ్గినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: కిమ్‌కు భారత్ షాక్... క్షిపణి పరీక్షలపై అమెరికాతో కలిసి..