Joe Biden Impeachment Inquiry : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అభిశంసన విచారణకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సాహం మేరకు రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులంతా ఏకగ్రీవంగా బైడెన్ అభిశంసన విచారణకు అనుకూలంగా ఓటు వేశారు. కుటుంబసభ్యుల వ్యాపారాల విషయంలో బైడెన్ అవినీతి లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు బయటపడలేదు. అయినప్పటికీ రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులు బైడెన్‌పై అభిశంసన విచారణకు అంగీకారం తెలిపారు. సెనేట్ విచారణలో బైడెన్ దోషిగా తేలితే ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తొలిగించవచ్చు. ఇందుకు సుధీర్ఘ సమయం పడుతుంది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న బైడెన్‌కు ఇది ఇబ్బందికరమేనని భావిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పదవిలో ఉండగా రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్నారు.
బైడెన్ కుటుంబ సభ్యుల వ్యాపారాల చుట్టూ ఉన్న వివాదాలపై ఏడాదిగా విచారణ జరుగుతోంది. అయితే, ఇందులో ఏమాత్రం పురోగతి లేదని భావిస్తున్న రిపబ్లికన్లు అభిశంసనకు డిమాండ్ చేస్తున్నారు. బైడెన్ తనయుడు హంటర్ బైడెన్ వ్యాపార ఒప్పందాలపై పార్లమెంట్లో విచారణ జరుపుతున్నారు. హంటర్ బైడెన్ విదేశీ వ్యాపార ఒప్పందాల వల్ల జో బైడెన్ వ్యక్తిగతంగా లబ్ధి కలిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 40 వేల పేజీల బ్యాంకు రికార్డులు, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లు, అధికారిక పత్రాలను సేకరించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష హోదాలో బైడెన్ అవినీతికి పాల్పడ్డట్లు కానీ, లంచం తీసుకున్నట్లు కానీ ఎలాంటి ఆధారాలు విచారణలో లభించలేదు. అయితే, విచారణ వేగంగా జరగడం లేదని చాలా మంది అసంతృప్తితో ఉన్నారని ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ చెప్పుకొచ్చారు. తదుపరి చేపట్టాల్సింది అభిశంసన ప్రక్రియేనని వ్యాఖ్యానించారు.
'పొలిటికల్ స్టంట్'
అయితే, శ్వేతసౌధం మాత్రం ఈ ప్రక్రియను అర్థరహితమైనదిగా అభివర్ణించింది. బైడెన్‌పై అభిశంసన వేటు వేసేందుకు తగిన ఆధారాలు లేవని కొందరు రిపబ్లికన్ పార్టీ సభ్యులే అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసింది. సభలో డెమొక్రాట్లు సైతం విచారణ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ట్రంప్ న్యాయపరంగా అనేక చిక్కుల్లో ఉన్నారని, దీన్నుంచి దృష్టి మరల్చేందుకే రిపబ్లికన్లు అభిశంసన ప్రక్రియను ముందుకు తెచ్చారని మండిపడ్డారు. 'ఇదంతా రాజకీయ స్టంట్. దీనికి విశ్వసనీయత, న్యాయబద్ధత లేవు' అని డెమొక్రాట్ ప్రతినిధి జిమ్ మెక్‌గవర్న్ ఆక్షేపించారు.
'అవును.. ఆ నేరాలన్నీ నేనే చేశా!'.. ఆరోపణలు అంగీకరించనున్న బైడెన్ కుమారుడు
అధ్యక్ష ఎన్నికల ఫలితాల కేసులో ట్రంప్‌కు చుక్కెదురు- పిటిషన్‌ను తిరస్కరించిన కోర్ట్