Israel Attack On Gaza Today : గాజాలోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ రక్తసిక్తమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేయడం వల్ల అల్లకల్లోలమైంది. వందల మంది గాయపడిన వారిని అంబులెన్సులు, ప్రైవేటు కార్లలో ఆసుపత్రులకు తరలించారు. నాజర్ ఆసుపత్రికి డజన్ల మంది గాయపడిన వారిని అంబులెన్సులు తరలించాయి. రెడ్‌క్రాస్, ఐక్యరాజ్య సమితి రెండూ ఏమయ్యాయంటూ ఓ మహిళ ఆసుపత్రి అత్యవసర విభాగం వద్ద అరుస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఖాన్ యూనిస్‌లోకి యుద్ధ ట్యాంకులు, బలగాలు ప్రవేశించడం శాటిలైట్ ఫొటోల్లో కనిపించింది. దాదాపు రెండు డజన్ల కాలనీల నుంచి పాలస్తీనియన్లు ఖాళీ చేసి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సొరంగాలను నీటితో నింపేందుకు సన్నాహాలు
మరోవైపు ఇజ్రాయెల్ దళాలకు గాజాలో పెద్ద తలనొప్పిగా మారిన హమాస్ సొరంగాలను నీటితో నింపే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పథకం ఫలిస్తే సొరంగాల్లో నక్కిన హమాస్ మిలిటెంట్లు ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు రావాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. తాజాగా ఈ వ్యూహంలో భాగంగా ఐడీఎఫ్ దళాలు భారీ నీటి పంపులను సొరంగాల వద్దకు చేర్చాయి
Gulf Countries On Israel : మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ మానవ హననానికి పాల్పడుతోందని, ఆ దేశం తీరుతో పశ్చిమాసియా ప్రమాదంలో పడుతోందని తుర్కియే, ఖతార్ ధ్వజమెత్తాయి. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేశాయి. మంగళవారం దోహాలో 6 గల్ఫ్ దేశాల అధినేతలు పాల్గొన్న గల్ఫ్ సహకార మండలి సదస్సులో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మాట్లాడారు. అన్ని మతపరమైన, నైతిక, మానవత్వ విలువలను ఉల్లంఘించి ఆక్రమిత పాలస్తీనాలో ఆ దేశం నేరాలకు పాల్పడుతోందని విమర్శించారు. మానవత్వంపై ఇజ్రాయెల్ సైనికులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వీయ రక్షణ అంటే మానవ హననానికి పాల్పడటం కాదని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ నేరాలపై అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. గాజాలో మహిళలు, పిల్లలు మరణిస్తుంటే అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌ను ఎలా అనుమతిస్తోందని ప్రశ్నించారు.
'ప్రశ్నించకుండా ఉండలేం'
గాజాలో నేరాలకు పాల్పడటం ద్వారా పశ్చిమాసియాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రమాదంలో పడేస్తున్నారని తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మండిపడ్డారు. ఆయన న్యాయపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. గాజాలో మానవత్వంపై జరుగుతున్న దాడిని ప్రశ్నించకుండా ఉండలేమని తెలిపారు. శాశ్వత కాల్పుల విరమణను తమ దేశం కోరుకుంటోందని చెప్పారు. ఈ సదస్సులో యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, తుర్కియే దేశాల నేతలు పాల్గొన్నారు.
'యుద్ధం తర్వాత ప్రజల సేఫ్టీ ముఖ్యం- ఇజ్రాయెల్ సరిహద్దుల్లో గట్టి భద్రత!'