అమెరికాలోని ఓ న్యాయస్థానం.. చిన్నారి హత్య కేసులో కోర్టు అరుదైన తీర్పు ఇచ్చింది. భారత సంతతికి చెందిన బాలిక(5) మృతికి కారణమైనందుకు 35 ఏళ్ల వ్యక్తికి 100 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2021లో లూసియానా రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మాయా పటేల్ మరణానికి కారణమైనందుకు నిందితుడికి ఈ శిక్ష విధించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఇదీ జరిగింది..
మాంక్‌హౌస్ డ్రైవ్‌లోని ఓ హోటల్‌ను మృతురాలు మాయా పటేల్ తండ్రి స్నేహిల్ పటేల్, విమల్ అనే వ్యక్తి కలిసి నడిపిస్తున్నారు. మాయా కుటుంబం అదే హోటల్లోని గ్రౌండ్ ఫ్లోరోలో ఉండేది. హోటల్లో మాయా పటేల్ ఆడుతుండగా ఆమె తలలోకి ఓ బులెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో మాయా మూడు రోజులు పాటు ఆస్పత్రిలోనే మృత్యువుతో పోరాడి 2021 మార్చి 23న ప్రాణాలు విడిచింది.
'నిందితుడు స్మిత్.. చిన్నారిపై అనుకోకుండా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో నిందితుడు స్మిత్.. మరో వ్యక్తితో గొడవపడ్డాడు. గన్‌తో అవతలి వ్యక్తిని కాల్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బుల్లెట్ అదుపుతప్పి సమీపంలో ఉన్న హోటల్ గదిలోకి దూసుకెళ్లింది. అక్కడే ఆడుకుంటున్న మాయా తలలోకి బులెట్ చొచ్చుకెళ్లి ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమైంది.' అని అధికారుల విచారణలో తేలింది.
శ్రేవ్‌పోర్ట్‌కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తిని జనవరిలోనే మాయా పటేల్ హత్య కేసులో జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. దీంతో జిల్లా కోర్టు జడ్జి జాన్ డీ మోస్లే.. స్మిత్‌కు 60 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అలాగే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు మరో 20 ఏళ్లు, ఇతర కారణాలతో మరో ఇరవై సంవత్సరాల శిక్షను విధించారు. దీంతో దీంతో నిందితుడు స్మిత్‌కు మొత్తం 100 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారైంది.
అత్యాచారం కేసులో 142 ఏళ్లు..
గతేడాది అక్టోబరులో.. కేరళలో పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు నిందితుడికి 142 ఏళ్ల కఠిన శిక్ష విధించింది పోక్సో కోర్టు. పథనంతిట్ట జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పదేళ్ల బాధితురాలిపై ఆమెకు బంధువైన నిందితుడు ఆనందన్(41) రెండేళ్ల పాటు లైంగిక దాడులకు పాల్పడేవాడని కోర్టు నిర్ధరించింది. పోక్సో, ఐపీసీ 506 సెక్షన్ ప్రకారం నమోదైన కేసులపై నిందితుడికి 142 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ.. పథనంతిట్ట అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి జయకుమార్ జాన్ తీర్పు ఇచ్చారు. శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.